పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : గౌతమ్ పోట్రు

by Disha Web Desk 23 |
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : గౌతమ్ పోట్రు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ లోని వి సి హాల్ లో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 ని వినియోగించుకోవాలన్నారు. ఇందుకు గాను సీఈఓ కార్యాలయపు వెబ్ సైట్ నందు ఉన్న పోస్టల్ బ్యాలెట్ కు సంబందించిన వివరాలను ఎన్ ఐ సి ద్వారా పొందుపరిచి పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఈ క్రమంలో ప్రతి జిల్లా అధికారి తమ కార్యాలయ సిబ్బంది తో సహా తమ వివరాలను పొందుపరిచే బాధ్యత కార్యాలయ అధికారి, నోడల్ అధికారిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. మే 6వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు తీసుకుంటామన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల రోజున విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి, ఈ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సర్వీస్ ఓటర్లకు ఫారం 12 అందించి దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటింగ్ వేసేవిధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చే ఇతర జిల్లా, ప్రాంత సిబ్బందికి ఒక రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లను గుర్తించడం వారికి ఫారం 12 అందించి జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story