విలీనం సరే.. మరి వాటి సంగతేంటి..?

by Sumithra |
విలీనం సరే.. మరి వాటి సంగతేంటి..?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : 2011 నుంచి కారుణ్య నియామకాల అంశం పరిష్కారం రాలేదని, కంటోన్మెంట్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. దేశ వ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను స్థానిక మున్సిపల్ శాఖలకు అప్పగించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో ఆయన బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయి పలు కీలక అంశాల పై చర్చించారు. విలీనం సందర్భంలో ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా అడుగులు వేయాలని కోరుతూ కంటోన్మెంట్ ఉద్యోగులు అందించిన లేఖను ఆయన కేంద్రమంత్రికి అందజేశారు.

స్పష్టత కోరిన ఈటెల..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తున్న సందర్భంలో పలు అంశాలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్తూ పలు కీలక అంశాలపై స్పష్టత కోరారు. ఇప్పటివరకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఉద్యోగులు విలీనం, పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు అంశం, పెన్షన్ జీతాలు అందించే అంశంపై స్పష్టత కోరారు. ఉద్యోగులు అందరిని జిహెచ్ఎంసి లోనే విలీనం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సివిల్ ఏరియా అంశంలో కేవలం 16 ప్రాంతాలు మాత్రమే ఉంటాయా లేదా మిగిలిన ప్రాంతాలు కూడా ఉంటాయా అనే విషయం పై చర్చించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన భూములు చేతులు మారాయని వాటి భవిష్యత్తు తేల్చాలని, హోల్డర్ ఆఫ్ ఆక్యుపేసి రైట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని, మిల్ట్రీ అధికారిక భూములలో వెలసిన గుడిసెలు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారని అడిగి తెలుసుకున్నారు. ఈ అన్ని అంశాలను విలీనానికి ముందే స్పష్టంగా నిర్ణయం తీసుకొని తెలియజేయాలని ఆయన కోరారు. అదేవిధంగా మూడు దశాబ్దాలుగా కంటోన్మెంట్ ఎంప్లాయ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారని, అస్మత్ పేట లో ఉన్న 28 ఎకరాలు, తుర్కపల్లి లో ఉన్న 13 ఎకరాలు విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఆ భూములను కంటోన్మెంట్ ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీ వారికి కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఆకుల మహేందర్, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి పరుశరాం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed