సమైక్యత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మాస్ డ్యాన్స్...

by S Gopi |   ( Updated:2023-03-28 14:31:15.0  )
సమైక్యత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మాస్ డ్యాన్స్...
X

దిశ, మేడ్చల్ ప్రతినిధి/కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నీ తానై తన ఆధ్వర్యంలోనే ప్రోగ్రాం అంటూ అందరూ భారీ జన సమీకరణతో విజయవంతం చేయాలని గత కొద్దీ రోజులనుండి చెప్పుకొచ్చారు. సభా వేదిక ఏర్పాట్ల నుండి, భారీ ర్యాలీ, భోజనం ఏర్పాట్లు, సాంస్కృతిక ఏర్పాట్లు అంటూ నాయకులను ఊరించారు. కానీ తీరా ప్రోగ్రాంకు వచ్చేవరకూ తన క్యాడర్ కు సరైన దిశ, నిర్దేశం చేయడంలో, సభను సక్సెస్ చేయడంలో విఫలం అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యక్రమం ముగింపు వరకూ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంగా మారడం, తెలంగాణ చరిత్ర గురించి, నిజాం ప్రభుత్వం భారత్ లో ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేకపోవడంతో కేవలం తీన్మార్ స్టెప్పుల కోసమేనా ఈ సభ అనేలా విమర్శలు వచ్చాయి.


ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కార్యక్రమం...

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ నియోజకవర్గంలో భారీ జన సమీకరణ జరిపి అందులో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ప్రోగ్రాం నిర్వహించాలి. జాతీయ సమైక్యత విధానం, తెలంగాణ వజ్రోత్సవ వేడుకల ఆవశ్యకతలను కూలంకుషంగా వివరిస్తూ ప్రోగ్రాం నిర్వహించి భారత దేశ ఔన్నత్యాన్ని, దేశభక్తి ఉట్టిపడేలా గీతాలపాన చేయించాలి. అలా చేస్తే అందరికీ ఆమోద్య యోగ్యత ఉండేది. కానీ అలా కాకుండా కొందరు సింగర్లను పిలిపించి రికార్డింగ్ డాన్సులు తలదన్నేలా తీన్మార్ స్టెప్పులతో ఎమ్మెల్యేతోపాటు కొందరు ప్రజా ప్రతినిధులు హల్ చల్ చేయడం, విద్యార్థులతో వేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో తీన్మార్ స్టెప్పులేస్తూ, డ్యాన్సులు చేస్తూ తెలంగాణ సమాజానికి ఓ శాసనసభ్యుడు ఇచ్చే మెసేజ్ ఇదేనా? అంటూ ప్రజలు గుసగుసలాడుతూ పెదవి విరిస్తున్నారు.

యువత, మహిళలు ఎక్కడ...?

ఈ కార్యక్రమానికి కేవలం కొన్ని పాఠశాలల విద్యార్థులు, కొందరు మహిళలనే రప్పించి తూతూ మంత్రంగా నిర్వహించడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే విఫలం అనే సాంకేతాలు వెలువడ్డాయి. కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో పదివేల మంది జనసమీకరణతో భారీ బహిరంగ సభ చేపట్టే అవకాశం ఉంది. సభను నిండుగా చూపించాలనే క్రమంలో భాగంగా సభ స్టేజ్ ఏర్పాట్లు కూడా రోడ్డుకు దగ్గరగా అధికారులు ఏర్పాట్లు చేయడం, ప్రజల నుండి పెద్దగా రెస్పాండ్ రాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోగ్రాం ఇంత అట్టర్ ప్లాప్ గా నిలవడం, తీన్మార్, డీజే పాటలు ప్రైవేట్ ఫంక్షన్ ను తలపించాయి తప్ప, అధికారిక కార్యక్రమంలా లేదని పలువురు బహిరంగ విమర్శలు చేశారు. జన సమీకరణపై పెద్దగా దృష్టి సారించకుండా తూతూ మంత్రంగా చేయడంపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. మహిళలు, యువతకు సభ ముందు ప్రత్యేక గ్యాలరీల పేరుతో కుర్చీలు వేయించి ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసినప్పటికి ప్రజలలో అనుకున్నంత రెస్పాన్స్ లేక ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వల్లే కుత్బుల్లాపూర్ లో అధికారిక కార్యక్రమాలు అట్టర్ ప్లాప్ గా నిలుస్తున్నాయని కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు విమర్శలు చేయడం కొసమెరుపు.

Advertisement

Next Story