ఎమ్మెల్యే సాయన్న అస్తమయం: తీవ్ర దిగ్భ్రాంతిలో బీఆర్ఎస్ శ్రేణులు

by Shiva |   ( Updated:2023-02-19 10:24:39.0  )
ఎమ్మెల్యే సాయన్న అస్తమయం: తీవ్ర దిగ్భ్రాంతిలో బీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయి అన్న ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్నకు భార్య గీత, ముగ్గురు పిల్లలున్నారు. 1951 మార్చి 5న జన్మించిన ఆయన బీఎస్సీ బీఏ. ఎల్ ఎల్ బీ పట్టభద్రులు. ఆయన మృతి చెందిన వార్తతో నియోజవర్గంలో విషధ ఛాయలు అలుముకున్నాయి.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు..

ఉమ్మడి రాష్ట్ర సమయంలో తెలుగుదేశం పార్టీలో ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సాయన్న 1994 నుంచి 2009 వరకు మూడుసార్లు టీడీపీ నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిని చవిచూశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఆయన నియోజకవర్గంలో 80 శాతం కంటోన్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్నప్పటికీ అందర్నీ కలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు సాయన్న. 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఉంటూ తన వంతు భక్తులకు సేవలందించారు.

Advertisement

Next Story

Most Viewed