కార్యకర్తల కష్టాన్ని మరిచిపోను

by Sridhar Babu |
కార్యకర్తల కష్టాన్ని మరిచిపోను
X

దిశ, కూకట్​పల్లి : అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​ నుంచి భారీ మెజారిటీ అందించేందుకు పని చేసిన కార్యకర్తలు, నాయకులను మరిచిపోనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​ కార్పొరేటర్​ ముద్దం నర్సింహ యాదవ్​ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​ నుంచి అత్యధిక మెజారిటీ అందించి గెలిపించారని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని, వారి కష్ట సుఖాలలో అండగా ఉంటానని అన్నారు. డివిజన్​ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, గతంలో మాజీ మంత్రి కేటీఆర్​ నాయకత్వంలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో డివిజన్​లో బోయిన్​ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్టు తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి కుంటు పడిందని, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు, బీఆర్​ఎస్​ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి గారడి చేయడం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు ఇర్ఫాన్, నరేందర్ గౌడ్, మక్కల నరసింగరావు, బాలరాజ్, ఎజాజ్, జంగయ్య, ఉదయ్ యాదవ్, అవినాష్, లలిత, అనురాధ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story