అమిత్ షా సభతో కాషాయ శ్రేణుల్లో జోష్

by Disha Web Desk 12 |
అమిత్ షా సభతో కాషాయ శ్రేణుల్లో జోష్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ సక్సెస్ కావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ’మల్కాజ్ గిరి జన సభలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళాకారుల ఆటపాటలు, లంబాడి నృత్యాలతో హోరెత్తించారు. అమిత్ షా మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. హోంమంత్రి తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. అంతకు ముందు మాట్లాడిన సికింద్రాబాద్, హైదరాబాద్‌ల లోక్ సభ అభ్యర్థులు కేంద్రంలో మూడో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ ప్రశాంతత కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేయ్యాలన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పడుతున్నట్లు తెలిపారు.

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది: ఈటల రాజేందర్

అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు మాటలతో.. మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మల్కాజ్ గిరి లోక్ సభ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని నీచపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని, బీజేపీ రిజర్వేషన్లను తీయదన్నారు. అణగారిన వర్గాలని అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా తనను, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా డాక్టర్ వంశ తిలక్ ని గెలిపించాలని ఈటల రాజేందర్ విజ్ఙప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంఎల్సీ రామచందర్ రావు,మాజీ ఎం ఎల్ ఏ లు ప్రభాకర్,సుభాష్ రెడ్డి, కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్, నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, మొండా కార్పొరేటర్ కొంతం దీపిక,నాయకులు భానుక మల్లికార్జున్,పరశురామ్, బీ ఎన్ శ్రీనివాస్,శంకర్,బాణాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Next Story