- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జడ్పీ సమావేశానికి అధికారులు డుమ్మా..
దిశ ప్రతినిధి,మేడ్చల్: జిల్లాలోని పలు శాఖల అధికారుల పనితీరుపై జిల్లా పరిషత్ పాలక మండలి సభ్యులు ,ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పలువురు అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు గరం గరం అయ్యారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మా ప్రమేయం, సమాచారం లేకుండా నేరుగా లబ్దిదారులకే అందజేస్తున్నారని మండి పడ్డారు. దళిత బంధు, మైనారిటీ బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి, కుట్టు మిషన్ల పంపిణీ లాంటి పథకాల గురించి కనీస సమాచారం ఇవ్వడంలేదని ద్వజమేత్తారు. ఇక అధికారులే అన్ని చేసుకుంటే.. ఇక మేముందని, సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు వర్తింప చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.తమకు తెలియకుండా సంక్షేమ పథకాలను ఇవ్వరాదని హుకుం జారీ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ సమావేశం మేడ్చల్ లోని జెడ్పీ హాల్ లో ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జెడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్,సిఈఓ దేవ సహాయం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు,భవన నిర్మాణాల అనుమతులు, తూకాల్లో మోసాలు,గ్రంధాలయాల సెస్ చేల్లింపులపై వాడివేడిగా చర్చ జరిగింది.
జడ్పీ చైర్మన్ సీరియస్..
జెడ్పీ సమావేశానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారితో పాటు మహిళ శిశు సంక్షేమ అధికారి గైర్హాజరు కావడంపై జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్ర రెడ్డి సీరియస్ ఆయ్యారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే సమావేశాలకు సైతం అధికారులు హాజరు కాకుంటే తమకు ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుందని మండిపడ్డారు. ప్రతి సారి ఏదో ఒక కారణం చెబుతూ జిల్లా అధికారులు సమావేశానికి డుమ్మా కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు అంశాలపై చర్చల సందర్బంగా ఆ శాఖలకు చెందిన జిల్లా అధికారులు అందుబాటులో లేకుండా కిందిస్థాయి అధికారులను సమావేశానికి పంపించడమేమిటని ప్రశ్నించారు.సరైన కారణాలు లేకుండా సమావేశానికి గైర్హాజారు అయిన అధికారులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకోవాలని సీఈఓ దేవ సహాయంను ఛైర్మన్ అదేశించారు.జిల్లా అధికారులు జెడ్పీ మీటింగ్ కు పంపించిన వారి దూతలను నివేదిక చదువనిచ్చేది లేదని తిప్పి పంపారు. మీ అధికారులను వచ్చి వివరణ ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డి ఆదేశించారు.కాగా బీసీ సంక్షేమ అధికారి బానోతు కేశురామ్ కోర్టు కేసు ఉందని తన సూపరింటిండెంట్ ను సమావేశానికి పంపించారు. అయితే జెడ్పీ ఛైర్మన్ సీరియస్ అయిన విషయాన్ని తెలుసుకోని హుటాహుటిన సమావేశానికి రావడం చర్చనీయాంశమైంది.
దళిత బంధు పేరిట డబ్బులు వసూళ్లు: వైయస్సార్
దళిత బంధు పేరిట దరఖాస్తులు తీసుకోని డబ్బులు వసూలు చేస్తున్నారని ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఘట్ కేసర్ మండలంలోని పలు గ్రామాలలో అధికార పార్టీ నేతలు ఏజెంట్స్ ను ఏర్పాటు చేసుకోని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై జెడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్ స్పందిస్తూ.. సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈ వసూళ్లు కన్పించలేదా...? దళిత బంధు చెక్కులు ఇచ్చినప్పుడు ఫోటోలు దిగినావ్.. ఇప్పుడు విమర్శిస్తావా..? అని ప్రశ్నించారు. దీనిపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎస్సీలకు సబ్ ప్లాన్ నిధులు ఇవ్వకుండా దళిత బంధ పేరిట దగా చేస్తున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్ సర్కారు హాయంలో ఒక లోన్ అయినా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. దళిత బంధు అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తుందని ఆరోపించడంతో జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి కలుగజేసుకోని ఏవరైనా దళిత బంధు పేరిట డబ్బులు వసూలు చేసినట్లయితే తనకు సమాచారం ఇవ్వాలని, పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు.
తనిఖీల్లేవ్...తూనికల కొలతలశాఖ పై గరంగరం..
తూనికల కొలతల శాఖ నిద్రాణావస్తలో ఉందని ఎక్కడ తనిఖీలు చేసిన దాఖాల్లేవని జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కడైతే కొలతల్లో అవకతవకలు జరుగుతాయో.. అక్కడ అధికారులు తనిఖీలు చేయరని, మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నట్లు నివేదికలు తయారు చేస్తారని, జెడ్పీటీసీలు శైలజా, అనిత, ఎంపీపీలు ఎల్లుభాయి, సుదర్శన్ రెడ్డి, గ్రాంధాలయ ఛైర్మన్ దర్గా దయాకర్ రెడ్డిలు ఫైర్ ఆయ్యారు. రైతు బజారులు, రేషన్ షాపులు, పెట్రోల్ బంకులలలో అస్సలు తనిఖీలు చేయడంలేదన్నారు. దీంతో జడ్పీ చైర్మన్ కలుగ జేసుకోని గ్రామాల్లో తనిఖీలు చేశారా..? పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లలో ఎన్ని తనిఖీలు చేశారని అధికారులను ప్రశ్నించారు. దానిపై క్లారిటీ సమగ్రంగా నివేదిక అందజేయాలని అదేశించారు.
చీర్యాలను మున్సిపాలిటీలో కలిపారా...?: జడ్పీ వైస్ చైర్మన్...
కీసర మండలంలోని చీర్యాల గ్రామ పంచాయితిని మున్సిపాలిటీలో కలిపేశారా..? అదే గ్రామానికి చెందిన జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డీపీఓ రమణమూర్తి నివేదిక సమర్పిస్తూ నిధుల విషయమై మాట్లాడుతుండగా, వైస్ చైర్మన్ కలుగ జేసుకున్నాడు. బడా బాబులు పెద్ద భవనాలను, షాపింగ్ కాంప్లెక్స్ లు అక్రమంగా నిర్మించినా.. వాటి జోలికి పంచాయితీ అధికారులు వెళ్లడంలేదని, పేద కుటుంబాలు ఇంటిని నిర్మించుకుంటే మాత్రం మఫ్టీలో హెల్మెట్ లు ధరించి కలెక్టరేట్ నుంచి వచ్చినం అని ఇంటి నిర్మాణదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీర్యాల, కీసర, గోధుమ కుంట గ్రామ పంచాయితీలలో ఈ తరహా బేధిరింపులు అధికమయ్యాయన్నారు. అయితే గతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు పెనాల్టీలు వేసి ఇంటి అనుమతి, పన్నుల రశీదులు ఇవ్వాలని కోరగా, డీఆర్ డీఓ పద్మజా సాధ్యం కాదని ,ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. శామీర్ పేట ఎంపీపీ ఎల్లుబాయి మాట్లాడుతూ.. కోర్టు కేసులలో ఉన్న హెచ్ఎండీఏ లే అవుట్లలో నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించాలని కోరగా, అది హెచ్ఎండీఏ చూసుకుంటుందని మంత్రి మల్లారెడ్డి సమాధానం ఇచ్చారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎదులాబాద్ గ్రామ కార్యదర్శి రూ.70 లక్షలను గతంలో తన సొంతానికి వాడుకున్నా... విచారణలో నిజం అని తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఓ ఐఏఎస్ అధికారి పనిచేస్తున్నా.. అవినితీ పరులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిషేక్ స్పందిస్తూ. త్వరలోనే ఆ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయితీ కార్మికులపై ఎంపీపీ సుదర్శన్ రెడ్డి చర్చ లేవనెత్తుతుండగా, జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి అడ్డుకున్నారు. ఏజెండాలో అని అంశాలను ఇక్కడ మాట్లాడవద్దని స్పష్టం చేశారు. గ్రంధాలయాలకు సంబంధించి జిల్లాలోని 61 గ్రామ పంచాయితీల సెస్ బకాయిలపై వివరాలను ఇవ్వాలని డీపీఓను కోరిన స్పందించడం లేదని ఛైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి అన్నారు. జిల్లా లో హరితహారంలో భాగంగా ఇప్పటికే 4 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారి ప్రకటించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాలను లేవని, ఎక్కడైనా గ్యాప్ ఉన్న ఏరియాలో మొక్కలు నాటుతున్నామని, చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి నాటుతున్నట్లు తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మంత్రి మల్లారెడ్డి
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జెడ్పీ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పరితపిస్తుంటారని అన్నారు.దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లతోపాటు సొంత ఇంటి స్థలం ఉండి ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తొలి విడుతలో 3వేల మంది రూ.3 లక్షల చొప్పున గృహ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని, రెండో విడుతలో మరో 3 వేల మందికి అందిస్తామని తెలిపారు. అలాగే దళితబంధు పథకం రెండో విడత కింద 1,100 మందికి అందచేస్తామని తెలిపారు. బీసీ బంధు, మైనారిటీ బంధు అందుకు సంబంధించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకొన్నాము అని తెలిపారు.