డెంగ్యూ కేసులపై గోప్యత..జ్వరాలను క్యాష్ చేసుకుంటున్న యాజమాన్యాలు

by Aamani |   ( Updated:2024-09-12 16:39:19.0  )
డెంగ్యూ  కేసులపై గోప్యత..జ్వరాలను క్యాష్ చేసుకుంటున్న యాజమాన్యాలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వారాలతో మేడ్చల్ జిల్లా వాసులు హడలెత్తి పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో డెంగ్యూ, విష జ్వరాల కేసుల వివరాలను నమోదు చేస్తున్నా.. ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రం వీటి లెక్కలను యజమాన్యాలు దాచి పెడుతున్నాయి.దీంతో జిల్లాలో ఎన్ని డెంగ్యూ కేసులున్నాయో లెక్క తేల్చేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది.కేసుల లెక్క తేలకుండా..క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల డెంగ్యూను కట్టడి చేయడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు.

డెంగ్యూ కేసులపై గోప్యత...

మేడ్చల్ జిల్లాలో దాదాపు 22,00 లకు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు,నర్సింగ్ హోమ్ లు,డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో చాలా మంది జ్వారాలతో హాస్పిటల్స్ పరుగులు తీస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ల్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావించి టెస్టుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. జ్వరం ఉంటే చాలు రెండు,మూడు రోజులు అడ్మిట్ చేసుకొని మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ టెస్టులు చేసేస్తున్నారు. ప్లేట్ లెట్స్ పడిపోయాయని, డెంగ్యూ ఉందంటూ భయపెట్టేస్తున్నారు. అడ్మిట్ చేసుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు భారీగా బిల్లులు వేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూ నిర్దారణ పరీక్షలను లోపభూయిష్టంగా చేస్తున్నారు. పలు ఆసుపత్రులలో ర్యాపిడ్ కిట్ల ద్వారా డెంగ్యూగా తేల్చేస్తున్నారు. నిర్దారించి ని కేసుల వివరాలను మాత్రం వైద్యారోగ్య శాఖకు పంపడంలేదు.

కొన్ని హాస్పిటల్స్ లో పేషెంట్ల కు కూడా ఆ రిపోర్టులు ఇవ్వడం లేదు.ఈ నెల 10వ తేదీన నాచారంలోని ప్రసాద్ ఆసుపత్రిని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.నెల రోజులుగా డెంగ్యూ కేసులు ఏమి లేవని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం జిల్లా వైద్యారోగ్యశాఖకు నివేదిస్తున్నా.. వైద్యాధికారి తనిఖీ చేసినప్పుడు 35 డెంగ్యూ పేషంట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో అవాక్కయ్యారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో నమోదయ్యే డెంగ్యూ కేసులు ఏ ప్రాంతాల వారివో తెలియకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం కావడం లేదు.

డెంగ్యూ పేరిట దోపిడీ..

డెంగ్యూ వైద్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అల్వాల్ కు చెందిన రమణ(37)కు ఐదు రోజుల క్రితం జ్వరమొచ్చింది. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే డెంగ్యూ అని నిర్దారించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయాలని సూచించడంతో అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.ప్లేట్ లెట్లు లక్షకు తగ్గగానే..వాటిని ఎక్కించాలని చెప్పి హడావిడి చేశారు. చివరకు వారం రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని నయమైందని ఇంటికి పంపించారు. రూ. 2.5 లక్షల బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే మున్ముందు వర్షాలు కురిసి నట్లయితే దోమలు వృద్ది చెంది వైరస్ వ్యాప్తికి అనుకూలిస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు వంటి విష జ్వరాలే కాకుండా..కలుషిత నీటితో వాంతులు,విరేచనాలు, కామెర్లు,టైఫాయిడ్ తదితర వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్నాయి.దీంతో ప్రజారోగ్యం అతలాకుతలమేననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

రోగులపై అనవసర ఒత్తిడి..

సాధారణంగా ఆరోగ్య వంతుని రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగ్యూ రోగులకు ఎప్పుడైతే ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోతుందో.. అప్పటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులను భయపెట్టే పర్వం ప్రారంభవుతోంది.ఐసియూ చికిత్స, గంటకోసారి పరీక్షలు, హడావిడిగా ప్లేట్ లెట్లు ఎక్కించడం తో కనీసం రూ.2 లక్షల రూ. 3 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయలని బాధితులు వాపోతున్నారు.

లెక్కలివ్వకుంటే కఠినంగా వ్యవహారిస్తాం: గౌతమ్ పోట్రు, మేడ్చల్ జిల్లా కలెక్టర్

జిల్లా ప్రజలు డెంగ్యూ వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు.జ్వరం వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు.జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ డెంగ్యూకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. సర్కార్ దవాఖాన్లలో చాలా వరకు బెడ్లు ఖాళీగానే ఉన్నాయి.వైద్య సిబ్బందిని మరింత అప్రమత్తం చేస్తాం.జ్వర పీడితులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తాం.. అదేవిధంగా రోగులను వైద్యం పేరిటి పట్టిపీడిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి కల్లెం వేస్తాం. కేసుల లెక్కలు ఇవ్వకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటాం..

Advertisement

Next Story

Most Viewed