పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి పై కేసు

by Mahesh |
పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి పై కేసు
X

దిశ, ఘట్కేసర్: పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి పై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాలకు వెళితే.. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో మీర్కానుకుంట ఎఫ్టిఎల్‌లో గత సంవత్సరం బతుకమ్మ ఘాట్ నిర్మించారు. దాదాపు 2 వేల గజాల్లో మట్టి నింపినందుకు అప్పట్లో ఇరిగేషన్ అధికారులు పోచారం మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. చెరువులో నింపిన మట్టిని తొలగించాలని లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ అండదండలతో కుంటలో మట్టిని తొలగించకుండా పోచారం మున్సిపాలిటీ అధికారులు.. ఇరిగేషన్ అధికారుల ఆదేశాలు పట్టించుకోలేదని విమర్శలున్నాయి.

స్థానిక కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ జిల్లా కలెక్టర్‌కు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ దూకుడుతో జిల్లా ఇరిగేషన్ అధికారులు చెరువుల కబ్జాపై చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్నోజిగూడ మీర్కానుకుంటలో బతుకమ్మ ఘాట్ నిర్మించినందుకు గాను చైర్మన్ కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ పై ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోచారం పోలీసులు 324(4), 279, బీఎన్ఎస్, 3 పీడీపీపీఏ సెక్షన్ల కింద (ఎఫ్ ఐ ఆర్ 411/2024) కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed