మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వాణి రెడ్డిపై దాడి

by Aamani |
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వాణి రెడ్డిపై దాడి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల తీర్మాణ వివాదం తారస్థాయికి చేరింది. తూంకుంట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వాణి వీరారెడ్డిపై కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , అనుచరులు కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడిలో పన్నాల వాణి వీరారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్ది రోజులుగా తూంకుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం విషయంలో కౌన్సిలర్ల మధ్య వివాదం కొనసాగుతోంది.

వివాదానికి కారణం..

తూంకుంట మున్సిపాలిటీలో గత మూడు నెలల క్రితం అసమ్మతి కౌన్సిలర్లు ఛైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ ఛైర్ పర్సన్ వాణి వీరారెడ్డిలపై అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణ నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒకటో వార్డు కౌన్సిలర్ భరత్ సింగ్ ను మద్దతు కోరుతూ, ఆయనకు కొన్ని డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. అయితే భరత్ సింగ్ డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ అవిశ్వాసం వీగిపోయింది. కౌన్సిలర్ భరత్ సింగ్ డబ్బులు తీసుకుని మద్దతు తెలుపుతానంటూ మోసం చేశాడంటూ అసమ్మతి కౌన్సిలర్లు సింగిరెడ్డి మదుసూదన్ రెడ్డి, రజనీ వేణుగోపాల్ రెడ్డి మిగతా కౌన్సిలర్లు శవయాత్ర కూడా నిర్వహించారు. అయితే ఈ వివాదం కౌన్సిలర్ల మధ్య కొనసాగుతూనే ఉంది.

కౌన్సిల్ లో లొల్లి

అవిశ్వాస తీర్మానం వల్ల కౌన్సిలర్లు మధ్య గత కొంత కాలంగా వివాదం రగులుతోంది. రెండు వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు.తమ వద్ద అవిశ్వాసం తీర్మానం కోసం కౌన్సిలర్లు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే వరకు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేశారు. అవిశ్వాసం విషయంలో తూంకుంట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ లు మాత్రం సమావేశాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగింది. సింగిరెడ్డి రజనీ వేణుగోపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డిల వర్గం కుర్చీలను వైస్ చైర్ పర్సన్ వాణి వీరారెడ్డి వైపు విసిరారు. ఈ దాడిలో వాణీ వీరారెడ్డి తలకు గాయాలయ్యాయి.దీంతో కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బాధితురాలు వాణి వీరారెడ్డి తో పాటు పిన్నింటి మహిపాల్ రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

బయటి వ్యక్తులు కౌన్సిల్ లోకి..

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు కౌన్సిలర్లు,అధికారులు కాకుండా బయట వ్యక్తులు రావడం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి.కౌన్సిలర్లు మధ్య అవిశ్వాసం విషయంలో వివాదం జరుగుతున్న సమయంలో కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు, అనుచరులు కౌన్సిల్ సమావేశంలో ఎలా అనుమతిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

తనపై కౌన్సిలర్లు అకారణంగా దాడి చేశారని మున్సిపల్ వైస్ చైర్మన్ పన్నాల వాణి వీరారెడ్డి శనివారం శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సమావేశంలో హాజరైన తనపై ఉదయం 11.30 గంటలకు కౌన్సిలర్లు సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి లతోపాటు సింగిరెడ్డి శశి కాంత్ రెడ్డి, సింగిరెడ్డి చంద్రకాంత్ రెడ్డి, కట్ట శశిధర్ రెడ్డి , బాణాలా భూపాల్ రెడ్డి, సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కె.రవీందర్ రెడ్డి మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు వాణి వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story