తెలంగాణతోపాటు దేశాభివృద్ధికి ఈటల సేవలు అవసరం : హరిదీప్ సింగ్

by Disha Web Desk 23 |
తెలంగాణతోపాటు దేశాభివృద్ధికి ఈటల సేవలు అవసరం : హరిదీప్ సింగ్
X

దిశ,మేడ్చల్ బ్యూరో : ఈటల రాజేందర్ సేవలు తెలంగాణకే కాదు దేశానికి కూడా అవసరమని, మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి దేశాభివృద్ధి కోసం పనిచేస్తారని కేంద్ర పట్టణ, పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి అన్నారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ కు ముందు శామీర్ పేటలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జి.కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య మాజీ కార్పొరేటర్ స్వప్న, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కేంద్రమంత్రులు, ఈటల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వారిని నాయకులు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరిదీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ నామినేషన్ లో పాల్గొనేందుకు పార్టీ నన్ను ఇక్కడికి పంపించింది. హాజరైనందుకు సంతోషంగా ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం చాలా విశిష్టమైనది. మినీ ఇండియా గా రూపాంతరం చెందిందన్నారు. ఈటల రాజేందర్ జనప్రియ నేత, అనుభవజ్ఞుడు. 7 ఏళ్లు మంత్రిగా పనిచేశారని తెలిపారు.. కరోనా సమయంలో ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు.ఈటల రాజేందర్ ను గెలిపించి లోకసభకు పంపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఆయన అనుభవం సేవలు ఢిల్లీలో కూడా అవసరమని, తెలంగాణలోనే కాదు భారతదేశ అభివృద్ధిలో మోదీతో కలిసి పని చేస్తారని అకాంక్షించారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రమాదవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అపలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదన్నారు. రాహుల్ గాంధీ ఏమి మాట్లాడుతున్నారో.. అయనకే తెలియట్లేదన్నారు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో కూడా అర్థం కావడంలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం లో అనేక సంస్కరణలకు నాంది పలికినట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోడిలో ఉందన్నారు. ఈటల రాజేందర్ అనేక ఉద్యమాలు చేశారు, ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మల్కాజిగిరిలో అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ గెలువబోతున్నట్లు విశ్వాసం ఉందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది. డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజిగిరి ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు.. మోదీ ఎన్నికల తొలి శంఖారవం ఇక్కడే చేశారు. గెలిచిరండి ఏది అవసరం అయితే అది ఇస్తా అని మోదీ మీకు చెప్పమని చెప్పారని తెలిపారు. మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానేని ఈటల స్పష్టంచేశారు. ఆపగలిగే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు లేదన్నారు.దొంగ సర్వే రిపోర్ట్ లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మల్కాజగిరిలో సర్వేలకు అందని ఫలితాలు రాబోతున్నట్లు చెప్పారు. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని, కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు నమ్ముకున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ బరిగీసి కొట్లాడే గడ్డ.. ఆత్మగౌరవంతో చెలగాటం ఆడవద్దని హితువు పలికారు. 22 ఏళ్లుగా నన్ను చూస్తున్న ప్రజలారా మీరే కథానాయకులై నాకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఈటల పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు.కంటోన్మెంట్ లో నాతోపాటు ఎమ్మెల్యే గా వంశీ తిలక్ కి ఒక ఓటు వేసి గెలిపించాలని ఈటల రాజేందర్ విజ్ఠప్తి చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నికలో పోటీ చేసిన సామరంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, నియోజకవర్గ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాజయ్య యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మల్క కొమరయ్య, సుధాకర్ గాండే, వీకే మహేష్, నారెడ్డి నందరెడ్డి, బాలసుబ్రమణ్యం, గిరివర్ధన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు.




అట్టహాసంగా నామినేషన్ దాఖలు..

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఈటల శామీర్ పేటలోని తన నివాసం నుండి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంవరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రుకు సమర్పించారు. అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, అభిషేక్ అగస్త్యలు మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ ఇంచార్జ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed