ఆర్డీవో కార్యాలయంతో డివిజన్ ఏర్పాటైనట్లేనా?

by Anjali |   ( Updated:2024-07-08 05:31:34.0  )
ఆర్డీవో కార్యాలయంతో డివిజన్ ఏర్పాటైనట్లేనా?
X

దిశ, నర్సాపూర్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో నూతనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 8 ఏళ్ల క్రితం నర్సాపూర్ కు రెవెన్యూ డివిజన్ మంజూరు అయింది. దాంతో నర్సాపూర్, శివంపేట, చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం తదితర మండలాలను కలుపుతూ నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం మండల పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన పశు సమర్ధక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో 2016 లో ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

డీఎస్పీ కార్యాలయం కోసం భవనం పరిశీలన

రెవెన్యూ డివిజన్ పరిధిలో డీఎస్పీ కార్యాలయంతో పాటు, సబ్ కోర్టు, విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం, ఆర్టీఏ కార్యాలయం తదితర కార్యాలయాలు రావలసి ఉన్నా ఇంతవరకు అతీగతి లేదు. అయితే డీఎస్పీ కార్యాలయం కోసం అప్పటి ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో పాటు తూప్రాన్ డీఎస్పీ ఇతర పోలీస్ శాఖ అధికారులు పట్టణంలోని పాత ఐసీడీఎస్ కార్యాలయం తో పాటు మరో రెండు కార్యాలయాలు పరిశీలించి చేతులు దులుపుకున్నారు. అయితే డివిజన్ ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాలు రాకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తమ పనుల కోసం మెదక్ తో పాటు, తూప్రాన్, సిద్దిపేట్ తదితర ప్రాంతాలకు వ్యయ ప్రయాసలు కోర్చి వెళ్లి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పక్కా భవనం లేక ఇబ్బందులు..

అయితే రెవెన్యూ డివిజన్ ఏర్పాటై సుమారు ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఏర్పాటైన ఒక్క ఆర్డీవో కార్యాలయం సైతం పక్కా భవనం లేక ఉన్న తాత్కాలిక భవనంలోనే అరకొర వసతులు నడుమ పనులు సాగించాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటైన రెవెన్యూ డివిజన్ సమస్యలను పరిష్కరించలేకపోయిందని, కనీసం నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా నూతన కార్యాలయాలు వచ్చి సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story