అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Kalyani |
అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధి జయలక్ష్మినగర్ కాలనీలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో రూ. 75 లక్షలతో సీసీ రోడ్డు, రెండవ వార్డులో రూ. 30 లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రెండో వార్డులో రూ. 10 లక్షలతో ఏర్పాటు చేసిన పార్క్, రూ. 30 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు.

అనంతరం పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భంచిన అనంతరం అమీన్ పూర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడంతో పాటు అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమీన్ పూర్ అంటేనే మంచినీటి కొరతకు చిరునామాగా ఉండేదని, నేడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. దీంతో పాటు రూ. 18 కోట్లతో పెద్ద చెరువు నుంచి హెచ్ఎంటీ వరకు రహదారి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చక్రపురి కాలనీలో రూ. 11 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

స్థానికుల విజ్ఞప్తి మేరకు పెద్ద చెరువు కట్టను సుందరీకరణ చేయడంతో పాటు, అల్లూరి సీతారామరాజు, చత్రపతి శివాజీ విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని మున్సిపల్ ముఖద్వారంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed