వనదుర్గమ్మ దర్శనం.. భక్తుల తన్మయత్వం..

by Sumithra |
వనదుర్గమ్మ దర్శనం.. భక్తుల తన్మయత్వం..
X

దిశ, పాపన్నపేట : ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ఇది ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధిలో నెలకొన్న వాతావరణం. వారాంతపు సెలవు రోజు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, ప్రధానంగా జంట నగరాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. శనివారం వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుడడుగుల ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లింది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వన దుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి రాకపోకలు స్తంభించాయి.

దీంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించిన సంగతి తెలిసిందే. ఆదివారం నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఉదయం నుంచి వనదుర్గామాత దర్శనాన్ని పున: ప్రారంభించారు. ఆయా ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు చెక్ డ్యాం, మంజీరా నదీ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని తనివితీరా దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఒడిబియ్యం, బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆలయ అర్చకులు పార్థివశర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుండటంతో భక్తులు, సందర్శకులు స్నానాలు చేస్తూ సందడిగా గడిపారు. భక్తులు ఆలయ పరిసరాల్లోని షెడ్లు, ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగు పయనమయ్యారు.

Advertisement

Next Story