అన్నదాత అష్ట కష్టాలు….

by Naresh |
అన్నదాత అష్ట కష్టాలు….
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎండ తీవ్రతతో వ్యవసాయ బావులు, బోరు బావులు అడుగట్టుతుండటంతో యాసంగి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. పంటలను దక్కించుకోవాలన్నా తపనతో కొందరు వ్యవసాయ బావుల్లో పూడికతీతలు, కొత్తగా బోర్లు వేస్తుండగా..మరికొందరు కాలువల్లో మోటర్లు వేసి కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీటిని తరలిస్తున్నారు. ఇక బావులు, బోరుబావుల పై ఆధారపడి సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన బోనాల లింగంకు 6 ఎకరాల భూమి ఉంది. 30 బోరు బావులు తవ్వించగా ఒక్క బోరు బావిలో కొంతమేర నీళ్లు వస్తున్నాయి. వ్యవసాయ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో పెద్ద కోడూరు గ్రామ సమీపంలోని ఊరచెరువు వరద కాలువలో 7 హెచ్ పీ మోటార్ ఏర్పాటు చేసుకుని సుమారు 2 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నాడు. లింగంతో పాటుగా అదే గ్రామానికి చెందిన మరికొందరు రైతులు ఇదే మాదిరి మోటర్లు ఏర్పాటు చేసుకొని పంటలను కాపాడుకుంటున్నారు.

రిజర్వాయర్ల ప్రధాన కాలువల్లో..

రిజర్వాయర్ల ప్రధాన కాలువల్లో రైతులు మోటర్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడుకుంటున్నారు. యాసంగి పంట సాగు కోసం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ జలాశయాల పంపులను స్టార్ట్ చేసి నీటి సరఫరాను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయా రిజర్వాయర్ల నుంచి ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన కాలువల వెంబడి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రధాన కాలువల వెంబడి రైతులు మోటర్లు ఏర్పాటు చేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. మోటార్లు, పైప్‌ల ఏర్పాటుకు లక్షలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ బావులు, బోరు బావులపై ఆధారపడి సాగు చేసే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పంటలను కాపాడుకోవడం కోసం ఓ రైతు వాటర్ ట్యాంకర్ వినియోగిస్తున్నాడు. జిల్లాలోని మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది.



1.41 మీటర్లు పడిపోయిన భూగర్భ జల నీటి మట్టం

జిల్లాలో సరాసరి భూగర్భ జల నీటి మట్టం 2023 ఫిబ్రవరి లో 8.66 మీటర్ల లోతులో ఉండగా 2024 ఫిబ్రవరిలో 10.07 మీటర్ల లోతుకు పడిపోయాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు జిల్లాలో సరాసరి భూగర్భ జల నీటి మట్టం 1.41 మీటర్ల లోతుకు పడిపోయినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2024 జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో భూగర్భ నీటి మట్టం 1.11 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే మే నాటికి జిల్లాలో భూగర్భ నీటి మట్టం మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మండలాల వారీగా…

జిల్లాలో భూగర్భ జల నీటి మట్టం గత సంవత్సరం ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలతో పోలిస్తే గణనీయం తగ్గినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. మండలాల వారీగా తగ్గిన భూగర్భ జల నీటి మట్టం వివరాలు అక్కన్నపేట మండలంలో -3. 26 మీటర్లు, అక్బర్ పేట భూంపల్లి -3.24 మీటర్లు, బెజ్జంకి -1.31 మీటర్లు, చేర్యాల -1.19 మీటర్లు, చిన్నకోడూరు -0.73 మీటర్లు, దౌల్తాబాద్ -4.61మీటర్లు, దూల్మిట్ట -1.98 మీటర్లు, దుబ్బాక -5.27 మీటర్లు, గజ్వేల్ -1.26 మీటర్లు, హుస్నాబాద్ -0.38 మీటర్లు, జగదేవపూర్ -1.52 మీటర్లు, కోహెడ -0.71 మీటర్లు, కొమురవెల్లి -1.41 మీటర్లు, కొండపాక -0.26 మీటర్లు, కుకునూరు పల్లి -0.87 మీటర్లు, మద్దూరు -1.13 మీటర్లు, మర్కుక్ -3.39 మీటర్లు, మిరుదొడ్డి -1.11 మీటర్లు, ములుగు -1.97 మీటర్లు, నంగునూరు -1.51 మీటర్లు, రాయపోల్ -5.25 మీటర్లు, సిద్దిపేట రూరల్ -0.26 మీటర్లు, సిద్దిపేట అర్బన్ -1.46 మీటర్లు, తొగుట -0.88 మీటర్లు, వర్గల్ -1.32 మీటర్ల మేర భూగర్భ నీటి మట్టం తగ్గినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed