ధన బలానికి వ్యక్తుల అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి

by Sridhar Babu |   ( Updated:2024-06-04 15:54:08.0  )
ధన బలానికి వ్యక్తుల అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి
X

దిశ, నర్సాపూర్ : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ధన బలానికి, వ్యక్తుల అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికలని వాటన్నింటినీ పక్కనపెట్టి ఏడు నియోజకవర్గాల ప్రజలు తమను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ ఐటీ ఎలక్షన్ కౌంటింగ్ వద్ద ఎంపీగా గెలుపొంది రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు ఏడు నియోజకవర్గాల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు లేకున్నా ఆదరించి గెలిపించారని అన్నారు. తనను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించారని చివరికి ఓటుకు

నోటు పంచి ఓడించాలని చూసినప్పటికీ ప్రజలు వెన్నంటి ఉండి తనను గెలిపించాలని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా పేద ప్రజల సమస్యలే అజెండాగా తీసుకొని పని చేస్తూ ముందు నిలిచిన తనని ఇంత గొప్పగా ఆశీర్వదించిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావులు ఉన్నప్పటికీ వారిని పట్టించుకోకుండా తమ గెలుపునకు కృషి చేశారని అన్నారు. తన గెలుపునకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ రఘునందన్ రావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళి యాదవ్, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed