గాంధీ, కౌశిక్ రెడ్డిల గొడవ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం.. మంత్రి పొన్నం ప్రభాకర్

by Sumithra |
గాంధీ, కౌశిక్ రెడ్డిల గొడవ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం.. మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వర్గల్ : ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల గొడవ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఆ ఘర్షణతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గౌరారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయడంతో పాటు ఎమ్మెల్యేల ఘర్షణ పై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే కుట్రతో కేసీఆర్ ఫిరాయింపులకు ఆజ్యం పోయగా, ప్రస్తుతం ఆ పాపం వారికి చుట్టుకునే ప్రమాదం నెలకొందని స్పష్టం చేశారు. పదేళ్ల వ్యవధిలో ప్రతిపక్షాలకు చెందిన 32 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ వారికి ఫిరాయింపు చట్టం వర్తింపజేయకుండా కాపాడింది నిజం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. అలాగే అప్పటి స్పీకర్ ఏ ఒక్కరి పై కూడా అనర్హత ప్రకటించలేదని, గతాన్ని మరిచి కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతుండగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి పేదల జీవితాలలో వెలుగులు నింపుతుందని అన్నారు. నిబంధనల ప్రకారమే పీఎసీ చైర్మన్ పదవి గాంధీకి వర్తింపజేయగా, గతంలో మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇచ్చిన విషయాన్ని వారు మర్చిపోయారని చెప్పారు. పార్టీలో బీసీ నేతగా ఎదిగిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ప్రశాంతంగా ఉన్న జంట నగరాలలో అల్లర్లు సృష్టించేందుకు పన్నుతున్న కుట్రలను సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పూజల హరికృష్ణ, సీనియర్ నేతలు శ్రీనివాస్ గౌడ్, బొమ్మల యాదగిరి, మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, నాయకులు జహీర్, రేగొండ గౌడ్, కరుణాకర్ రెడ్డి, వెంకటేష్, భాను గౌడ్, శ్రీనివాస్, ఎక్బాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed