ఆ లిస్ట్ లో ఉన్నదెవరు..? సీఎం హెచ్చరికలతో BRS నేతల్లో టెన్షన్.. టెన్షన్

by Satheesh |
ఆ లిస్ట్ లో ఉన్నదెవరు..? సీఎం హెచ్చరికలతో BRS నేతల్లో టెన్షన్.. టెన్షన్
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: అవినీతీ, అక్రమాలకు పాల్పడుతున్న వారి తోకలు కత్తిరిస్తాం. దళిత బందు పథకంలో కూడా చేతి వాటం చూపారు. కొందరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల నుంచి లక్షలు తీసుకున్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావడం కష్టమే. అక్రమార్కుల జాబితా నా వద్ద రెడీగా ఉన్నది అని రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ప్లీనరీ చేసిన హెచ్చరికలు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వణుకుపుట్టిస్తున్నాయి.

తమకు తామే చాలా నీతి మంతులం, గొప్పవాళ్లం అని చెప్పుకుంటున్నప్పటికీ ఎక్కడో ఓ చోట అందోళన మాత్రం చెందుతున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలలో ఎవరైనా సీఎం కేసీఆర్ లిస్టులో ఉన్నారా..? అనేదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది. అక్రమార్కులు ఎవరు..? మంచి వారెవరు..? అని అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఏ ఎమ్మెల్యేపై వేటు పడనున్నదనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

ఇంటెలిజెన్స్ నిఘా...ఎమ్మెల్యేలు అప్రమత్తం..

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, మంత్రి హరీష్ రావులు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాపై పడింది. ఈ జిల్లాలో ఎవరు అక్రమార్కులు, అవినీతి పరులు అనే అంశంపై విస్త్రతంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు, నారాయాణఖేడ్, అందోలు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ సెగ్మెంట్లు ఉన్నాయి.

ఇందులో సిద్దిపేట, గజ్వేల్ సెగ్మెంట్లలో మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, సంగారెడ్డి లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జెగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంటే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి సెగ్మెంట్లను మినహాయిస్తే మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరు అవినీతి పరులు..? దళిత బంధు నిధులు మింగింది ఎవరు..? అనే అంశాలపై చర్చ జరుగుతున్నది. ఇదే విషయమై ఇంటలీజెన్స్ వర్గాలు కూడా పక్కాగా మరోసారి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. గతంలో అందించిన సమాచారం మేరకు సీఎం సొంత పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలపై సీరియస్ అయినట్లు తెలిసింది.

మంత్రి హరీష్ రావు ఫోకస్..

తాను ఇన్చార్జిగా మంత్రిగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాపై మంత్రి హరీష్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..? ఎవరిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నది..? అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎవరిపై ఉన్నాయి..? సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఎవరి ఆగడాలను అరికట్టాలి అనే అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అధికారం ఉన్నది కదా..అని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడాన్ని అటు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి హరీష్ రావు కూడా తప్పుబడుతున్నారు. గతంలో ఎలా ఉన్నాం.. గత తొమ్మిదేళ్ల పాలనలో మనం ఏ స్థాయికి ఎలా ఎదిగాం. ఓ స్థాయికి ఎదిగాం కదా అని ఎవరిని పడితే వారిపై నువ్వెంత అనే స్థాయిలో కొందరు పార్టీ నేతలు ఆగ్రహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగినట్లు ఉండాలనే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల పద్దతిని ఉమ్మడి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు పాటించడం లేదని ఆ పార్టీలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

మీడియా ప్రతినిధులపై చిందులు..

ఉమ్మడి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రస్టేషన్ కు గురవుతున్నట్లు ఇటీవల పలు ఘటనలు వెలుగు చూశాయి. గత తొమ్మిదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నాం. తమకు మించి ఇంత వరకు ఎవరు కూడా ఇలా పనిచేయలేదు. మేమంటే ఏమనుకున్నారు..? అంటూ మీడియా ప్రతినిధులను తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఎవరు ఏం చేయలేరు..మా లెక్కలు మాకున్నాయి. మేం మామూలు వాళ్లం కాదు అంటూ బెదిరిస్తున్నట్లు కూడా తెలిసింది.

మీడియాకు దమ్ముందా..? అనే స్థాయిలో హెచ్చరికలు చేస్తున్న వారు కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుపై అసక్తి నెలకొన్నది. ఓ వైపు మంత్రి హరీష్ రావు జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపి వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుండగా కొందరు ఎమ్మెల్యేలతో పార్టీ బదనాం కావడంతో పాటు తమకు చెడ్డపేరొస్తుందని పార్టీ శ్రేణుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తంగా సీఎం హెచ్చరికలు ఉమ్మడి మెదక్ జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed