ఖదీర్ ఖాన్ మృతి బాధాకరం: జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహాజాధి బేగం

by Kalyani |
ఖదీర్ ఖాన్ మృతి బాధాకరం: జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహాజాధి బేగం
X

దిశ, మెదక్ ప్రతినిధి: ఖదీర్ ఖాన్ మృతి బాధాకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావొద్దని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహాజాధి బేగం అన్నారు. మెదక్ పట్టణంలో పోలీస్ లాఠీ దెబ్బలకు గాయాలై మృతి చెందిన ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. జరిగిన ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఘటన జరిగినప్పుడు తనకు సమాచారం వచ్చిందని, కానీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉండడం వల్ల రాలేకపోయినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని కోరారు. వీటికి సంబంధించి అరగంటలో క్లారిటీ ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు.

ఘటన విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారన్నారు. ఖదీర్ ఖాన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కమిటీనీ కూడా రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేశారని, ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ కమిటీ చేస్తుందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కమిషన్ నిలబడుతుందన్నారు. మోడీ పాలనలో కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని, రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డీఎస్పీ సైదులు, మైనార్టీ నేతలు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed