అధికారులు స్పందించారు.. ఆక్రమణలు తొలగించారు: 'దిశ' కథనానికి స్పందన

by Shiva |   ( Updated:2023-04-12 14:35:18.0  )
అధికారులు స్పందించారు.. ఆక్రమణలు తొలగించారు: దిశ కథనానికి స్పందన
X

దిశ, జహీరాబాద్: మునిసిపాలిటీ పరిధిలోని రంజోల్ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు వాస్తవమేనని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుర్తించారు. 'రహదారిపై అడ్డగోలుగా నిర్మాణాలు' అనే శీర్షికతో ఈ నెల 4న 'దిశ' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.

ఆయన సూచనల మేరకు జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్ లో గల ప్రభుత్వ భూమిని జహీరాబాద్ ఆర్డీవో, మున్సిపల్ ప్రత్యేక అధికారి రమేష్ బాబు, జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ మల్లా రెడ్డి, తహసీల్దార్ జె.స్వామి పరిశీలించారు. సర్వే. నెం.111లో గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించి వాటిని జేసీబీతో తొలగించారు.

జహీరాబాద్ మునిసిపల్ పరిధిలోని రంజోల్ గ్రామంలో ప్రజల రాక పోకలకు వీలుగా ఉన్న రహదారిని ఆక్రమించుకొని అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని స్థానికులు ఎంతోకాలంగా అధికారులుకు తెలిపారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు కూడా నిర్ణయించారు. అయినప్పటికీ ఆక్రమణలు తొలగించలేదు.

దీంతో ఆక్రమణదారులు రానురాను తమ పరిధిని పెంచుకుంటూ వెళ్లడంతో రహదారి పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో స్థానిక రైతులు మరోసారి జిల్లా కలెక్టర్ శరత్, మంత్రి హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మరోసారి సంబంధిత అధికారులకు విన్నవించడంతో వారు ఆ దిశగా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed