సీపీఆర్ తో ప్రాణ నష్టాన్ని నివారించాలి: ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

by Shiva |
సీపీఆర్ తో ప్రాణ నష్టాన్ని నివారించాలి: ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: కార్డియాక్ అరెస్ట్, ఆకస్మిక గుండెపోటు అధికంగా సంభవిస్తున్న ఈ తరుణంలో ప్రజలు సీపీఆర్ తో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో సీపీఆర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళ్ల ముందే కొందరు సడెన్ కార్డియాక్ అరెస్ట్, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామని తెలిపారు.

అలాంటి ఆపద సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుక సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ పై అవగాహన, శిక్షణ కల్పించాలని నిర్ణయించారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండూ ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కానీ, వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అవి రెండూ వేరని స్పష్టం చేశారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ గా షాక్ గురవుతారు. ఆ క్రమంలో హృదయ స్పందనలో తేడా వచ్చి గుండె కొట్టుకోవడం ఆగి పోతుందని తెలిపారు.

ఆ సమయంలో మనిషికి స్పందన ఉండదని, శ్వాస ఆగిపోతుంది తెలిపారు. అలాంటప్పుడు గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందించడంతో గుండె, ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయని తెలిపారు. దానినే సీపీఆర్ అంటారని, దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అంటారని మంత్రి పేర్కొన్నారు. కొన్నిసార్లు అలా చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదని, ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డెఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) అనే వైద్య పరికరంతో ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందన్నారు.

జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది ఒక్కసారిగా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో, టీవీల్లో చూస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో సీపీఆర్ చేస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. దేశంలో రోజుకు 4 వేల సడెన్ కార్డియాక్ అరెస్ట్ లు జరుగుతున్నాయని, అందులో 90శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని హరీష్ రావు వెల్లడించారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు, మెడికల్ పరిజ్ఞానం, వయస్సుతో సంబంధం లేదని ఎవరైనా సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, పారా మెడికల్ సిబ్బందితో పాటు, వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సీపీఆర్ మీద శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేసుకుంటున్నామని.. ఆ ఐదుగురు జిల్లాల్లో మిగతా సిబ్బందికి శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు.

ప్రతి మాస్టర్ ట్రైనర్ రోజుకు మూడు బ్యాచుల చొప్పున 60 మందికి మొత్తంగా వారానికి 300 మందికి శిక్షణ ఇవ్వబోతున్నారని తెలపారు. 1,240 మెడికల్ ఆఫీసర్లు, 1,300 స్టాఫ్ నర్సు, 8,500 ఏఎన్ఎంలు, 26,000 నుంచి ఆశాలకు ఇలా అందరికీ శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందు కోసం రూ.15 కోట్లతో అవసరమైన 1,262 ఏఈడీ మిషన్లు ప్రొక్యూర్ చేసుకుని, అన్ని పీహెసీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఆలోచన చేసి సీపీఆర్ ట్రైనింగ్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం సంతోషకరమని ఆయన తెలిపారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయితే, అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ రాజశేఖర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలు కాపాడిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు.

Advertisement

Next Story