మీరు అన్నట్లుగానే ఓట్లు అడుగుదాం....

by Naresh |   ( Updated:2024-03-27 10:14:32.0  )
మీరు అన్నట్లుగానే ఓట్లు అడుగుదాం....
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. డబుల్ బెడ్ రూం కట్టిన దగ్గర బీఆర్ఎస్, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన దగ్గర కాంగ్రెస్… రైతు బంధు ఇవ్వని వాళ్లను బీఆర్ఎస్.. ఇచ్చిన వారిని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతు బంధు అందరికీ ఇస్తాం.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు ఏ రకంగా ఇచ్చారో అందరికీ తెలుసు.. ఇప్పుడే తొందరపడోద్దని గులాబీ నాయకులకు సూచించారు.

కరువుకు బీఆర్ఎస్ కారణమని అనడం లేదని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కారణం కాదన్నారు. వర్షాభావ పరిస్థితిని, వాస్తవాలను మాజీ మంత్రి హరీష్ రావు వక్రీకరించడం దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి రైతాంగానికి సాగునీరు అందించినట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. వివిధ పనులకు సంబంధించి సుమారు రూ.40 వేల కోట్ల రుణ భారం కాంగ్రెస్ ప్రభుత్వం పై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అంశంపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

చిన్నపిల్లల తినుబండారాలు బిల్లులతో సహా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం పాటుపడుతామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 120 రోజుల పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమలు చేసినట్లు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బాధ్యత గల ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కులిపోతుందని వ్యాఖ్యానించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, నాయకులు బొమ్మల యాదగిరి, లక్కరసు సూర్యవర్మ, నరుకుల శివప్ప తదితరులు పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కన్నీటి పర్యతం:



సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ సందర్భంగా అవమానం జరిగిందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా ముద్దం లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రెస్ మీట్‌కు పిలిచి కుర్చోనే అవకాశం తనకు ఇవ్వకపోవడం బాధ కలిగిందన్నారు. మంత్రి, డీసీసీ ప్రెసిడెంట్ అందరూ ఉండగా అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed