మమ్మల్ని బతకనివ్వండి.. క్రషర్ల ఏర్పాటును ఆపండి

by Shiva |
మమ్మల్ని బతకనివ్వండి.. క్రషర్ల ఏర్పాటును ఆపండి
X

ప్రజాభిప్రాయ సేకరణలో గళమెత్తిన లక్డారం వాసులు

దిశ పటాన్ చెరు: మమ్మల్ని బ్రతకనివ్వండి.. మాకు జీవించే హక్కుని రాజ్యాంగం కల్పించింది.. ఇప్పటికే గోస పడుతున్నాం.. ఇప్పటికే ఉన్న క్రషర్లు చాలు.. ఇక కొత్తవి వద్దంటూ లక్డారం గ్రామస్థులు డిమాండ్ చేశారు.బుధవారం పటాన్ చెరు మండలం లక్డారం సర్వే నెం.747లోని 10.12 హెక్టార్లలో క్రషర్ ఏర్పాటుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, పీసీబీ అధికారులు గ్రామస్థుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు.

ఈ సందర్భంగా లక్డారం గ్రామస్థులు భిన్నమైన వాదనలను వినిపించారు. కొందరు క్రషర్ల ఏర్పాటును సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు. గ్రామస్థులు కావలి వీరేశం, శ్రీకాంత్ ఇప్పటికే ఉన్న క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అటు ఆరోగ్యపరంగా ఇటు వ్యవసాయపరంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని అధికారులకు తెలిపారు. ఒకప్పుడు మండలంలోని పాడి పంటలతో అభివృద్ధి చెందిన గ్రామంగా ఉన్న లక్డారం క్రషర్ల పుణ్యమా అని వెనకపడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి గుట్టలు ఉండడమే తమ గ్రామానికి పాపంగా పరిణమించిందని వాపోయారు.

కాలుష్య నియంత్రణ మండలి క్రషర్ యాజమాన్యాలకు కాలుష్య నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిందన్నారు. ఇందుకు నెల రోజుల గడువు ఇచ్చింది పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు ఒక్క యాజమాన్యం కూడా పీసీబీ అధికారుల ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ ప్రశ్నించారు. తమకు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పించిందన్నారు. ఇప్పటికే ఉన్న క్రషర్లతో అనారోగ్యం బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. ఇప్పటికే తాము పడుతున్న అవస్థలు చాలని కొత్తగా తమ గ్రామానికి క్రషర్ల మంజూరు అవసరం లేదని గ్రామస్థులు తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed