పరిశ్రమల కాలుష్య నివారణకు కిషన్ రావు సేవలు మరువలేనివి.. ఎంపీ

by Sumithra |
పరిశ్రమల కాలుష్య నివారణకు కిషన్ రావు సేవలు మరువలేనివి.. ఎంపీ
X

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం దివంగత డాక్టర్ అల్లాని కిషన్ రావు సేవలు మరువలేనివని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. ఆదివారం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో అల్లాని కిషన్ రావు స్మాల్ కమిటీ ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ముందుగా కిషన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పాత్రికేయుడుగా పనిచేసే సమయంలో డాక్టర్ కిషన్ రావుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పర్యావరణవేత్తగా పేదల డాక్టర్గా విద్యావేత్తగా గోశాల నిర్వాహకులుగా బహుముఖ ప్రజ్ఞను చాటిన ఘనత కిషన్ రావుదని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయనతో కలిసి నడిచిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు పరిశ్రమల ద్వారా మాత్రమే కాలుష్యం ఉండేదని ఇప్పుడు ప్రతి ఇంట్లోకి కాలుష్యం వచ్చిందన్నారు. ప్రతిఒక్కరు ఇండ్లలో ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కాలుష్యం పై కిషన్ రావు చేసిన పోరాటాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల సైతం గుర్తించాయన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం పదవీ విరమణ చేసిన అనంతరం నేరుగా కిషన్ రావు వద్దకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్యాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. కిషన్ రావు చేసిన పోరాటం ఆనాడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేసిన మహనీయుడు కిషన్ రావు అని కొనియాడారు. అటువంటి గొప్ప నాయకుడు స్ఫూర్తిగా మనమందరం ముందుకు కదులుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోశాల ట్రస్ట్ చైర్మన్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ నరసింహారెడ్డి, మాజీ ఆర్టీఏ కమిషనర్ దిలీప్ రెడ్డి, పర్యావరణవేత్త శిల్పా కృష్ణ, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తో పాటు కిషన్ రావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story