- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డంగా దొరికినా.. ఆందోలులో అంతే..
దిశ, సంగారెడ్డి బ్యూరో/ఆందోల్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్ తహశీల్దార్ పరిధిలో రోజుకో అక్రమ వ్యవహారం బయటకు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఆందోల్ రెవెన్యూ అంటే వివాదాలకు ఆమడ దూరంలో ఉండేది. ఈ మధ్య కాలంలో ఆందోల్ రెవెన్యూలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెవెన్యూలో పనిచేసే కొందరు అధికారులు అక్రమార్జనకు అలవాటుపడి అక్రమార్కులకు వంత పాడుతున్నారు. సాక్షాత్తు అధికారులే కబ్జా దారులకు వత్తాసు పలుకుతూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఖాళీ భూముల పై కన్నేసి ఖతం చేసే బ్యాచ్ లకు అండగా నిలబడి సలహాలిచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు ఫోర్జరీ సంతకాలు, ఆధార్ కార్డు మార్పిడితో పాటు సామాన్యులను నిండా ముంచుతున్న రియల్ వ్యాపారులకు తోడుగా నిలబడుతున్నారు. రెవెన్యూ అధికారుల పై ఆధారాలతో సహా మీడియాలో కథనాలు వస్తున్నా ఉన్నత యంత్రాంగం తొంగి చూడకపోవటంతో ఈ పాపాల్లో అందరికీ సమాన వాటాలు ఉన్నాయనే వాదనలు బలపడుతున్నాయి.
ఆధారాలున్నా అలసత్వమే...
అందోల్ మండలం డాకూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఫోర్జరీ ఆధార్ కార్డుతో భూ విక్రయం తతంగం పై పూర్తి ఆధారాలతో "దిశ" దిన పత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దిశ పూర్తి వివరాలతో వెలువరించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును పొర్జరి చేసి ఫోటో మార్పింగ్ చేసి రూ.7 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. ఏకంగా చనిపోయిన వ్యక్తి స్థానంలో మరొకరిని తీసుకువచ్చి భూ విక్రయం జరిపారు. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఇంత బహిరంగంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మరీ వేరొకరి భూమిని విక్రయించడం పెద్ద నేరం. ఆ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాలుపంచుకున్న ఒక అధికారి అన్ని తెలిసి ఈ దొంగ భూ విక్రయానికి పాల్పడ్డాడని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగి పక్కా స్కెచ్ వేసి ఫోర్జరీ ఆధార్ కార్డుతో భూ విక్రయానికి ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఈ తతంగంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు సమాచారం.
పూర్తి ఆధారాలతో దొంగతనం బయటపడ్డ ఇప్పటి వరకు అధికారులు ఈ వ్యవహారం పై స్పందించలేదు. అధికారుల వద్ద పూర్తి ఆధారాలున్నా ఈ తతంగం పై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడం పై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే ఆధారాలు ఉన్న చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు చర్చ జరుగుతుంది.
సామాన్యులను ముంచిన సంస్థకు అండగా..
ఫోర్జరీ ఆధార్ కార్డుతో భూమిని కొల్లగొట్టడంలో సహకరించిన అధికారులు సామాన్యులను నిండా ముంచిన మరొక రియల్ ఎస్టేట్ సంస్థకు వంత పాడారు. బై బ్యాక్ పేరుతో సామాన్యుల నుంచి వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన 12 వెల్త్ క్యాపిటల్ సంస్థకు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరించారని చెప్పవచ్చు. తప్పుడు ప్రకటనలతో భూమిని గుంటలు గుంటలుగా విభజించి మార్కెట్ ధర కంటే నాలుగింతలు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులకు తెలిసినా, గతంలోనే "దిశ" పత్రిక ఈ భూ బాగోతం పై హెచ్చరించిన అధికారులు మాత్రం తమ లాభాపేక్ష కొరకు పక్కన పెట్టారు. చర్యలు తీసుకునే వ్యవహారంలో పక్కన ఉండి సమర్థించి ఆ సంస్థకు కొమ్ముకాశారు. ఎటువంటి హద్దు బంధులు లేకుండానే గుంటలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. కొనుగోలు దారులు మోసపోతారని అధికారులకు స్పష్టంగా తెలిసినా తమ స్వలాభం కోసం ఆ సంస్థ కోసం పనిచేశారనే విమర్శలున్నాయి. ఫలితంగా వందల మందిని కోట్ల రూపాయల ముంచి ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.
అండదండలుంటే చర్యలు శూన్యమైనా...?
ఒకవైపు రాజకీయ అండదండలు మరో వైపు జిల్లా అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతోనే రెవెన్యూ కార్యాలయంలోని ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల మద్దతు ఉండడంతోనే తప్పులు చేసినా తమకేం కాదన్న ధీమాతో అధికారులున్నట్లు జరుగుతున్న తతంగాన్ని చూస్తే అర్థం అవుతుంది. ఆధార్ కార్డు ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన అధికారితో పాటు ఆధార్ కార్డు ఫోర్జరీకి సహకరించిన మరొక ఉద్యోగి వివరాలు ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం జంకుతున్నారని చెప్పవచ్చు.
సామాన్యుడు ఏదైనా తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేసే అధికారులు పూర్తి ఆధారాలున్నా చర్యలకు వెనుకడుగు వేయడం తీవ్ర విస్మయం కల్గిస్తుంది. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంతో ముడిపడ్డ ఆధార్ కార్డు ఫోర్జరీని పోలీసు అధికారులు సైతం తేలికగా తీసుకోవడం పై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే తప్పులు చేసిన సులువుగా తప్పించుకోవచ్చా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ వరుస వివాదాలు ఆందోల్ రెవెన్యూకు మచ్చ తెస్తున్నాయి. ఈ వరుస వివాదాలకు అధికారులు అండదండలే కారణమని కొందరు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే ఈ తతంగమంతా సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి.