గుండె పోటుతో భార్య మృతి అంటూ భర్త మాస్టర్ ప్లాన్.. చివరికి ట్విస్ట్

by Mahesh |   ( Updated:15 Sept 2024 5:07 PM  )
గుండె పోటుతో భార్య మృతి అంటూ భర్త మాస్టర్ ప్లాన్.. చివరికి ట్విస్ట్
X

దిశ, అందోల్‌: కట్టుకున్న భార్యను హత్య చేసి.. ఎవరికి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు ఓ భర్త. మృతురాలి కుటుంబీకులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. అందోలు గ్రామానికి చెందిన వెండికోలు నర్సింలుకు మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామానికి చెందిన ఇందిరతో (33)13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంత కాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో నర్సింలు గ్యాస్‌ డెలివరి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆమెకు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో 4 ఏళ్ల క్రితం కూకట్‌పల్లి లో ఉంటున్న లలిత అనే మహిళతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండవ భార్యకు ఇద్దరి సంతానం అయ్యింది. కూకట్‌పల్లి ప్రాంతంలోనే 75 గజాల స్థలంలో మూడంతస్తుల భవనాన్ని నర్సింలు నిర్మించాడు.

ఇద్దరు భార్యలు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మొదటి భార్య ఇందిరా అదే ఇంట్లో కిరాణా షాపు నడుపుతున్నది. ఇందిర తరుచూ ఫోన్‌లు ఎక్కువగా మాట్లాడుతుందని నర్సింలు అనుమానం పెంచుకోగా, ఇద్దరి భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం ఇందిరకు నరసింహులు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో గుడ్డతో ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. ఇందిరా చనిపోయిందంటూ బావమరిది బాలకృష్ణకు ఫోన్ చేసి తెలిపాడు. ఎవరికి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేసాడు. మృతురాలి ఒంటిపై అక్కడక్కడ గాయాలు కనిపించడంతో ఆమె కుటుంబీకులు నర్సింలును గట్టిగా నిలదీయడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలు తల్లి మొగులమ్మ ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నరసింహులను పోలీసులు అదుపు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed