నో రిస్క్.. రెఫర్ టు గాంధీ..!?

by Anjali |   ( Updated:2023-06-06 02:29:46.0  )
నో రిస్క్.. రెఫర్ టు గాంధీ..!?
X

దిశ, మెదక్ ప్రతినిధి : ప్రభుత్వం పేదల వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రైవేట్‌లో ప్రసవాలు తగ్గి సర్కారులు పెరిగాయంటే.. ముమ్మాటికీ ప్రభుత్వం తీసుకున్న చొరవే.. కానీ కొంత మంది వైద్యుల నిర్లక్ష్యం మూలంగా మళ్లీ ప్రైవేట్ వైపు వెళ్లే ప్రమాదం ఏర్పడింది. పురిటి నొప్పులతో మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన గర్భిణికి ప్రసవం చేయకుండా.. రక్తహీనత పేరుతో గాంధీకి సిఫార్సు చేశారు.. తీరా ప్రైవేట్ లో రక్త పరీక్ష చేస్తే నార్మల్ గా వచ్చింది.. సుఖ ప్రసవం జరిగింది.. కానీ ఇక్కడ ప్రభుత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా చూపించి డెలివరీ చేయకుండా పంపించారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక రోజే నలుగురు గర్భిణులకు గాంధీకి సిఫార్సు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెదక్ జిల్లా కేంద్రంలో మాత శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు తర్వాత ప్రసవాలు సంఖ్య గణనీయంగా పెరిగింది. నెల వ్యవధిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా వారీగా చూస్తే ప్రథమ స్థానంలో ఒకటి గా నిలుస్తుంది. ఇంతటి రికార్డును సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చొరవ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి అత్యుత్తమ వైద్య సేవకు అందిస్తున్న వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చేపడుతున్న అత్యుత్తమ సేవల పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది.. ఇందుకు ఇటీవల మాత శిశు ఆరోగ్య కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే కారణం.. డెలివరీ అయిన తర్వాత గర్భిణీలకు ఇన్ఫెక్షన్ సమస్య ప్రధాన విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు క్రిటికల్ పేరుతో గాంధీకి సిఫార్సు కూడా గర్భిణులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. మెదక్ మెదక్ పట్టణం నవాబ్ పేట కు చెందిన పోచయ్య కుమార్తె సంధ్య గర్భిణీ గా 31 మార్చి 2023 న నమోదు చేసుకుంది.

అప్పటి నుంచి హిమోగ్లోబిన్ నార్మల్ గానే ఉంది. ఈ నెల నాలుగు పురిటి నొప్పుల రావడం తో ఎంసీహెచ్ కు తీసుకు వచ్చారు. సంధ్య కు రక్త పరీక్ష చేసిన సిబ్బంది హెచ్ బీ 8.5 గా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. రక్తహీనత కారణంగా కాన్పు కష్టంగా మారిందని, ఇక్కడ డెలివరీ సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. రక్తహీనత వల్ల రిస్క్ అన్న దృశ్య హైదరాబాద్‌లోని గాంధీకి సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు.. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు ఎందుకు గాంధీకి రాస్తున్నారని ప్రశ్నించగా రక్తంలో హెచ్ బీ 8.5 ఉందని, అందుకే గాంధీకి తరలించిన చెప్పడంతో అంత దూరం వెళ్లే ధైర్యం చేయని కుటుంబీకులు పట్టణం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.. అక్కడ హెచ్ బీ పరీక్షలు చేస్తే 12 హెచ్ బీ వచ్చింది. దీంతో వెంటనే సిజేరియన్ చేయగా పండంటి మగ బిడ్డ జన్మించాడు.. దీంతో సంధ్య కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు..

రక్త పరీక్షలో తేడాలో ఆంతర్యం ఏమిటి..!?

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సంధ్య‌కు రక్త పరీక్ష చేసి హిమోగ్లోబిన్ 8.5 గా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు. రక్తహీనత కారణంగా సిజెరియన్ చేస్తే రిస్క్ అయ్యే కారణంగా గాంధీకి తరలించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పిన విషయం. కానీ అదే గంట వ్యవధిలో ఓ ప్రైవేట్ ప్రసూతి ఆసుపత్రిలో రక్త పరీక్ష చేస్తే 12 హెచ్ పీ వచ్చింది. వెంటనే గంట వ్యవధిలో కాన్పు చేశారు. ఇక్కడే మాత శిశు ఆరోగ్య కేంద్రం నిర్లక్ష్యం బహిర్గతం అవుతుంది. కేవలం గంట వ్యవధిలో హిమోగ్లోబిన్ లో వ్యత్యాసం ఎందుకు వచ్చింది. మూడు నెలలుగా ఆసుపత్రికి పరీక్షలకు వస్తున్న గర్భిణికి రక్తహీనత ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంధ్య తో పాటు మరో ముగ్గురు గర్భిణి‌లను కూడా వైద్యులు గాంధీకి సిఫార్సు చేశారు. సంధ్య రక్త పరీక్షల రిపోర్టు లో ఎందుకు తేడా వచ్చింది. ప్రైవేట్ లో 12 హెచ్ బీ రావడం వల్ల ప్రసవం లో ఎలాంటి సమస్య లేకుండా జరిగింది.

అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో అదో నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అందుబాటులో వైద్యులు లేకపోవడం వల్లనే గాంధీకి సిఫార్సు చేసి చేతులు దులుపుకునే ఉద్దేశ్యం తో రక్తహీనత కారణం చూపారన్న అనుమానం కలుగుతుంది. సంధ్య తో పాటు ఒకే రోజు మరో ముగ్గురిని కూడా పంపడం పై ఈ అనుమానాలకు బలం కలుగుతుంది.. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా కాన్పులు చేయిస్తే.. అధికారుల నిర్లక్ష్యం ఇలా జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. గాంధీ కి సిఫార్సు చేయడం మూలంగా ప్రైవేట్ ను ఆశ్రయించి వేలు ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఎదురైంది. దీనితో పాటు కెసిఆర్ కిట్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం కూడా కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ చేస్తాం..

రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాతనే సర్జరీ చేస్తాం.. కానీ ప్రైవేట్ లో పరీక్షలో తేడా వచ్చిన విషయం తన దృష్టికి రాలేదు.. దీనిపై విచారణ చేస్తాం. చంద్ర శేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, మెదక్

Advertisement

Next Story