మొద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి హరీష్ రావు..

by Sumithra |
మొద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి హరీష్ రావు..
X

దిశ, కొల్చారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన కొల్చారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు దీక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారంటీలు, 16 హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ పై వాగ్దానం చేశారని, ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ హామీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కారు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు అన్నారు. ఈ జిల్లాకు వెళితే ఆ జిల్లాలోని దేవుళ్ల పై ఓట్లు వేస్తూ దేవుడిని సైతం మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ. 15,000 రైతు భరోసా నిధులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వర్షాకాలం పంటలు చేతికొచ్చినప్పటికీ యాసంగి సీజన్ ప్రారంభమైన రైతు భరోసా ఊసేత్తడం లేదన్నారు.

నెల 15 రోజుల క్రితం వరి పంట కోతలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వెయ్యడం లేదన్నారు. రైతులు కొనుగోలు ప్రారంభించాలని రోడ్లెక్కుతుంటే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గాలి మోటార్లలో ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మొద్దు నిద్రలో ఉందన్నారు. కొల్చారంలో జరిగిన రైతు దీక్షను చూస్తే మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నారు. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చేసేందుకు రైతు దీక్షలు అన్ని జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో త్వరలో చేపట్టనున్నట్లు హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకోవడానికి మైక్ ముందుకు రాగానే తిట్ల పురాణం అందుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సీఎం కాగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బూతుల సీఎంగా గుర్తింపు పొందాడన్నారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ప్రతి పంటకు ఎకరాకు రూ .5000 రైతుబంధు డబ్బులు, ప్రమాదవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు ఐదు లక్షలు రైతు బీమా చెల్లించేది అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం చేపట్టిన ఒక్కో పథకాన్ని నిలిపివేసింది అన్నారు.

కాన్పు జరిగితే ఆడపిల్లలకు రూ. 15000, మగ పిల్లలకు రూ .12,000 ఇవ్వడంతో పాటు కేసీఆర్ కిట్లు ఇచ్చేదాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అవన్నీ మానివేసిందన్నారు. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులో కోసుకొని చెరువులు కుంటలు మరమ్మత్తులు చేసిందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 16 హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు ప్రచారం నిర్వహిస్తున్నాడని, ఇది ఎంతవరకు నిజమని రైతులను ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ జరిగిందా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా, నాలుగు వేల పెన్షన్ ఇచ్చారా, అంటూ రైతులను మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి రైతులని కాదు దేవుళ్లను సైతం మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచాడు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్యారెంటీకి బాండ్ పేపర్ కు విలువ లేకుండా పోయిందన్నారు.

బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే సగం మంది రైతులకు అయినా రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ వాయిదాల సర్కారుకు గుర్తింపు వచ్చిందన్నారు. 66 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనకు నిదర్శనమే మూసి కాలుష్యం అన్నారు. మూసి కాలుష్యం ప్రక్షాళన పేరుతో వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ సర్కార్ తెరలిపోయిందన్నారు. తల విడిచి తోక పట్టినట్లు మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కూల్చిన ప్రదేశంలో కాకుండా నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేయడం ఏమిటని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాదయాత్రలో పాల్గొనాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 11 నెలల పాలనలో ఉన్న అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మైకు ముందుకు రాగానే తిట్ల పురాణం అందుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

రానున్న రోజుల్లో రాజకీయ నాయకుల మాటలకు కూడా సెన్సార్ పెట్టాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, వరి కంకలతో చేసిన మాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కొనింటి మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, దేవేందర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కొల్చారం మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మేఘమాల సంతోష్, మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ రావు, సీనియర్ నాయకులు యాద గౌడ్, యాదయ్య, కిష్టయ్య, ప్రవీణ్ నర్సింలు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed