ఎట్టకేలకు గుల్షన్ క్లబ్ సభ్యుల సమావేశం

by Shiva |
ఎట్టకేలకు గుల్షన్ క్లబ్ సభ్యుల సమావేశం
X

వచ్చే నెల7న సాధారణ సమావేశం..

సభ్యులందరూ హాజరు కావాలి : మెదక్ ఆర్డీవో సాయిరాం

దిశ, మెదక్ ప్రతినిధి : హమ్మయ్య.. ఎట్టకేలకు గుల్షన్ క్లబ్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించేందుకు మెదక్ ఆర్డీవో, క్లబ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ సాయిరాం మంగళవారం నోటీసులు జారీ చేశారు. మెదక్ పట్టణంలో ఉన్న ఎకైక గుల్షన్ క్లబ్ కొందరి చేతుల్లో ఉన్న వైనంపై దిశ వరస కథనాలు ప్రచురించింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోగా కనీసం జనరల్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదు. రెండేళ్ల కు ముందు ఆర్డీవో ఏర్పాటు చేసిన ఆరుగురు కమిటీ తో క్లబ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

దాదాపు 50కి పైగా దుకాణ సముదాయాలు ఉన్న క్లబ్ లో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్లబ్ కు అధికారిక కమిటీ లేకపోవడం వల్ల జరుగుతున్న అక్రమాలపై దిశ పత్రికలో ' కొందరి గుప్పిట్లో గుల్షన్ క్లబ్ ' అనే కథనం ప్రచురించింది. ఇందుకు స్పందించిన మెదక్ ఆర్డీవో సాయిరాం పత్రికలో వచ్చిన కథనంపై నోటీస్ జారీ చేసి సమగ్ర వివరాలు జరపాలని ఆదేశించారు. కానీ, ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ముందుకు సాగకపోవడంతో ఎన్నికలు జరిగేనా.. అనే కథనం కూడా ప్రచురితమైంది.

దీంతో క్లబ్ పై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగడంతో పాటు క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ మామిడ్ల ఆంజనేయులు, గూడూరు ఆంజనేయులు గౌడ్ తో పాటు పలువురు సభ్యులు సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు సభ్యుల సంతకాల తో కూడిన వినతి పత్రం కూడా అందజేశారు. మెదక్ ఆర్డీవో సాయిరాంను తక్షణమే క్లబ్ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కానీ ప్రక్రియ సైతం ముందుకు సాగలేదు. మళ్లీ ఇటీవల క్లబ్ సభ్యులు ఎన్నికలపై ముందుకు సాగడం లేదనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆగ్రహించిన కలెక్టర్ ఆడిట్ చేయడంతో పాటు క్లబ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని ఆదేశించారు.

ఇందులో భాగంగా మెదక్ ఆర్డీవో క్లబ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా జనరల్ బాడీ మీటింగ్ కు నోటీసు జారీ చేశారు. క్లబ్ సభ్యులు జూన్ 7న ఉదయం 11 గంటలకు జరిగే జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు కావాలని సూచించారు. ఏడేళ్ల పాటు ఎలాంటి సమావేశం లేకుండా కొందరి చేతుల్లో ఉన్న క్లబ్ కు ఎన్నికలు నిర్వహించే దిశగా సభ్యులు ముందుకు సాగుతారా, లేక మళ్లీ పాత విధానంలోనే కొందరికి క్లబ్ ను అప్పగిస్తారా అనే విషయం ఈనెల 7న తేలనుంది.

Advertisement

Next Story