ప్రజలను మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 15 |
ప్రజలను మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, కొండపాక : పథకాల అమలు పేరుతో ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నాడని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు 4 నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోలేదని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల పరిధిలోని కుకునూర్ పల్లి , చిన్నకిష్టాపూర్, బోబ్బయిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఆగస్టు 15వ తేదీలోగా రూ 2 లక్షల పంట రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గతాన్ని మరిచి మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపగా, ప్రజలు నిలదీస్తుంటే బిక్కముఖం వేస్తున్నట్లు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టనుందని,

ఆలాగే నూతన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీని ప్రశంసిస్తుండగా, ఇండియా కూటమి నేతలకు మాత్రం నచ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీ సర్కార్ కట్టుబడి పనిచేస్తుండగా, రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్ ఆయా వర్గాలను రెచ్చగొడుతున్నట్లు చెప్పారు. అమిత్ షా అనని మాటలను అన్నట్లుగా ఆపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబం జైలు పాలు కాక తప్పదని, అయితే చట్టం తన పని తాను చేసుకు పోతుండగా కవిత అరెస్టును బీజేపీకి అంటగడుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ గా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేద రైతుల పోట్టగొట్టగా,

చెప్పిన ప్యాకేజీ సైతం అమలు చేయలేదని అన్నారు. ఈ క్రమంలో నిర్వాసితులు, ముంపు బాధితులు ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. నాలుగు వేల ఫించన్ ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నలుగున్నర లక్షల జీతం తీసుకుంటున్నారన్నారు. 5 వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముడికి గుడి కట్టించిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగిడి మోహన్ రెడ్డి , జిల్లా కార్యదర్శి మన్నెం శశిధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి, నాయకులు దాసరి స్వామి, రెడ్డమైన లింగం, కోరె సంతోష్, మంద రాజు, హరీష్ పంతులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed