'ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి'

by Vinod kumar |   ( Updated:2022-12-14 14:28:10.0  )
ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి
X

దిశ, మెదక్ ప్రతినిధి: ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్‌లైన్ డేటా ఎంట్రీ, ఓటర్ జాబితా రూపకల్పన పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి జిల్లాలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 26 లోపు పరిశీలించి డిస్పోజ్ చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆయన సూచించారు.

ఉపాధి దృష్ట్యా కొంత మంది పట్టణాల్లో జీవిస్తున్నప్పటికి గ్రామాల్లో వారికి ఓటు హక్కు ఉంటుందని, రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి డూప్లికేట్ లేకుండా తగుచర్య తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయని, అధిక సంఖ్యలో ఓటరు నమోదు ప్రక్రియ జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం పకడ్బందీగా ఓటరు జాబితా సిద్ధం చేస్తే, ఎన్నికల సమయంలో ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న జనాభాకు ఓటర్ల నిష్పత్తి, ఓటర్లలో జెండర్ నిష్పత్తి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఉండే విధంగా కృషి చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ఓటరు నమోదు సమయంలో ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లతో సమావేశమై వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా జిల్లాలో 18 సంవత్సరాల నిండిన దివ్యాంగుల అందరికీ ఓటు హక్కు కల్పించి, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల నిండిన ఓటర్ల సంఖ్య 6,149 ఉందని, క్షేత్రస్థాయిలో సదరు వివరాలను మరోసారి ధృవీకరించాలని ఆయన సూచించారు. మేడ్చల్ జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ మాట్లాడుతూ.. గత నవంబర్ 26,27, ఈ నెల 3,4 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 6 వేల దరఖాస్తులు వచ్చాయని, అందులో 4 వేల దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయ్యిందని, వారం రోజుల్లోగా అన్ని దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆన్ లైన్‌లో అప్ డేట్ చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డీఓ సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed