చంద్రబాబు మాటలు హాస్యాస్పదం : మంత్రి హరీశ్ రావు

by Sridhar Babu |
చంద్రబాబు మాటలు హాస్యాస్పదం : మంత్రి హరీశ్ రావు
X

దిశ, జగదేవపూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారని, ఇక్కడి ప్రాంత ప్రజలు జొన్నగట్కా, మొక్కజొన్న గట్కా తప్ప ఏమీ తినలేదని, ఇవాళ తన వల్లే ఈ ప్రాంత ప్రజలు అన్నం తింటున్నారని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జగదేవపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ గ్రేస్ బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఉప్పల్ టీం, జగదేవపూర్ టీంలు పోటీ పడగా ఉప్పల్ టీం విన్నర్ గా, రన్నర్ గా జగదేవపూర్ టీం నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నగదు తో పాటు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగరాశాడని కేసీఆర్ లేకపోతే కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంతంలో ప్రస్తుతం మండుటెండల్లో చెరువులు నుండి మత్తడులు దూకుతుంటే ప్రజలు సంబుర పడుతున్నట్లు తెలిపారు. తైవాన్ దేశం నుంచి హాక్సన్ కంపెనీ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ను కలిస్తే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారని, ఏడేళ్లలో అబ్బురపోయే అభివృద్ధి, సీఎం కేసీఆర్ విజన్ చూసిన తైవాన్ వారు తమ దేశం వచ్చి అభివృద్ధిని వివరించాలని కోరినట్లు తెలిపారు. ఇది చూసిన తమకు ఎంతో సంతోషం కలిగిందని మంత్రి అన్నారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్ రాష్ట్రస్థాయి క్రికెట్ గ్రేస్ బాల్ టోర్నీని నిర్వహించినందుకు మంత్రి హరీష్ రావు ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, ఎక్బాల్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed