కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నా పంపిణీ చేయడం లేదు: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Kalyani |
కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నా పంపిణీ చేయడం లేదు: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, చేగుంట: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ప్రజా గోస బీజేపీ భరోసా అనుబంధంగా మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలోని శక్తి కేంద్రాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజలు కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ బియ్యాన్ని పంపిణీ చేయకుండా కేవలం ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

పేద ప్రజలందరికీ ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామన్నా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. కాగా ప్రతి ఎమ్మెల్యేకు మూడువేల చొప్పున ఇండ్ల నిర్మాణం కోసం ప్రతిపాదన పంపడానికి అవకాశం ఉందని, అన్ని గ్రామాల నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు చింతాల భూపాల్, దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ గోవింద కృష్ణ, అనంతసాగర్, బాగులు, కుమ్మరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story