మహిళలను విస్మరించిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు: మంత్రి హరీష్ రావు

by Shiva |
మహిళలను విస్మరించిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు: మంత్రి హరీష్ రావు
X

దిశ‌, జహీరాబాద్: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మహిళలను విస్మరించాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. త్వరలో మహళల కోసం గృహలక్ష్మి, న్యూట్రీషియన్ కిట్ పథకాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పస్తాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మహిళలను సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం బీదర్ లో కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. సీఎ కేసీఆర్ తన చెల్లెలికి, మేనకోడలికి ఇస్తున్న కానుక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని అన్నారు. గతంలో గీతారెడ్డి మంత్రిగా ఉన్నా.. ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బీబీ పాటిల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాలసిస్ సెంటర్ తదితర వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా రూ.12 కోట్లతో మాత, శిశు సంరక్షణ ఆసుపత్రిని నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. త్వరలో ఆరోగ్యలక్ష్మితో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలిచ్చే గృహలక్ష్మి పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈనెల 16 నుంచి న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆరోగ్య మహిళ పథకం ద్వారా ప్రతి మంగళవారం మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 5 కేంద్రాలు ఉండగా జహీరాబాద్ నియోజకవర్గంలో బిలాల్పూర్, ఝరాసంగంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు రూ.36 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు నెలల్లో మిగతా బకాయిలను విడుదల చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, కలెక్టర్ డాక్టర్. శరత్, జడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీపీ అంజమ్మ, బీఆర్ఎస్ నేతలు గుండప్ప, గోవర్ధన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, నామ రవికిరణ్, నవీన్ , వివిధ గ్రామాల సర్పంచ్ లు , ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed