యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలి

by Naresh |
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలి
X

దిశ, పాపన్నపేట: మహాశివరాత్రి ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించే జాతర ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్‌లు అధికారులకు సూచించారు. ఈ నెల 08 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్లు ప్రగతి పై శనివారం జాతర ఆవరణలో గల హరిత హోటల్ నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో రమాదేవి, దేవాదాయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ బాలా గౌడ్, తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర, సంబంధిత ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, పోలీస్ ఎక్సైజ్, లీగల్ మెట్రాలజీ, ఆర్టీసీ, ఫైర్, మెడికల్, విద్యుత్, మత్స్యశాఖ, వెటర్నరీ, సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్‌లు వెంకటేశ్వర్లు, రమేష్ మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసినదిగా అధికారులకు సూచించారు.

భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అని అన్నారు. అధికారులు సమిష్టిగా, సమన్వయంతో ఈ నాలుగు రోజులు మరింత కష్టపడి పనిచేయాలని, సమయం దగ్గర పడుతున్నందున అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు పిన్ పాయింట్ వారీగా రోజు వారి షిఫ్ట్ ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించి, పాసులు జారీ చేయాలని తద్వారా సిబ్బంది విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తారని అన్నారు. బ్యారీ కేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు పారిశుధ్యంపై ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని, షవర్, మంచినీటి కుళాయిలు, శౌచాలయాలు అన్ని వినియోగంలో ఉండేలా చూడాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జిల్లా నలుమూలల నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి బస్సులు నడపాలని, గజ ఈతగాళ్లు, వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని, భక్తులతో సిబ్బంది ఎక్కడ దురుసుగా ప్రవర్తించవద్దని, చాలా సహనంతో విధులు నిర్వహించాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వీవీఐపీ దర్శనాల్లో ఆలయ మర్యాదలను పాటించాలని ఆలయ ఈఓను ఆదేశించారు. జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఏడుపాయల జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఏరియాలో పోలీస్ సిబ్బంది ప్రజలకు రక్షణగా అందుబాటులో ఉంటారని అన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం మహా జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏడి మైన్స్ జయరాజ్, మత్స్యశాఖ అధికారి నరసింహారావు, ఆర్టీసీ డిఎం సుధ, ఇండస్ట్రీస్ జీఎం కృష్ణమూర్తి, ఆర్ అండ్ బి ఈఈ సర్దార్ సింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed