నిండిన నారింజ.. నీరు వృధా..

by Sumithra |
నిండిన నారింజ.. నీరు వృధా..
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టైన నారింజ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు జలాశయం నీటితో కళకళలాడుతోంది. మరోవైపు వృధా అవుతున్న నీటితో కళ్ళముందే జలమట్టం అక్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షపు నీరు నారింజ ప్రాజెక్టులోకి వచ్చిచేరింది. వర్షపు నీటితో నిండిపోయిన నారింజ ప్రాజెక్టు గేట్ల పై నుంచి వారం రోజులుగా నీరు చేరుతుంది. సాగునీటి ప్రాజెక్టు అయిన నారింజ జహీరాబాద్ ప్రాంతంలో భూగర్భ జల పెంపునకు ఎంతగానో తోడ్పడుతోంది. ఈ ప్రాంతవాసులకు దాహార్తి తీరేందుకు దోహదం చేస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

16 సెంటీమీటర్ల వర్షానికే సరి..

ఇదిలా ఉండగా కేవలం 16 సెంటీమీటర్ల వర్షం నీటికే నారింజ ప్రాజెక్టు నిండి పోతుంది. అంటే సాధారణంగా వర్షాకాలంలో ఒకటి రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాలకే ప్రాజెక్టు నిండుతోంది. మిగిలిన రోజుల్లో ఎంత వర్షం కురిసినా వృధానే అవుతుంది. నారింజ జలాశయం నిండి ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని గుర్తిస్తే అధికారులు గేట్లు ఎత్తి కిందికి వదిలేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు ఇక్కడ సర్వసాధారణంగా మారింది. నారింజను అభివృద్ధి చేసి చుక్కనీరు కూడా కర్ణాటకకు పారకుండా చూడాలని రైతులు, నాయకులు, ఉద్యమకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఎన్నోసార్లు ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా సీఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకుని సాగు, తాగునీటి నీటి ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని నారింజ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఒక్క చుక్క నీరు కూడా కర్ణాటకకు పారకుండా చర్యలు చేపట్టాలంటున్నారు.

3 వేల ఎకరాల ఆయకట్టు.. 1 ఎకరానికి కూడా అందడం లేదు

3వేల ఎకరాల పైగా సాగునీరు అందించాలని లక్ష్యంతో నిర్మించిన నారింజ డ్యామ్ నుంచి ఇంతవరకు 1ఎకరానికి కూడా నీరు అందడం లేదు. ప్రతి సంవత్సరం విరివిగా కురిసిన వర్షాలతో వచ్చిన వరద సుమారు 3 నుంచి 4 టీఎంసీల నీరు వృధా అవుతుంది. కోహీర్, జహీరాబాద్ మండలాల్లో ప్రవహిస్తున్న నారింజ నీటి వృధా నివారణకు గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసారన్న ఆరోపణలు ఉన్నాయి. వృధా అవుతున్న వరదనీటి మళ్లింపుతో కొంతమేరకైనా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని నీటి పారుదల శాఖ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. నారింజ ప్రాజెక్టుకు 3 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నప్పటికీ ఒక ఎకరానికి కూడా నీరు అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రాజెక్టు చిక్కుకుంది. స్థానిక ప్రాజెక్టు ద్వారా వృధా అవుతున్న నీరంతా కర్ణాటకకు పారుతుంది.

అక్కడి బిళ్ళను సస్యశ్యామలం చేస్తుంది. వర్షపు నీరు వృధా కాకుండా స్థిరీకరించినందుకు అవసరం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమారు 65 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీద ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు కుడి, ఎడమ రెండు కాలువలు ద్వారా కనీసం 1000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు ఒక్క చుక్క నీరు కూడా ప్రాజెక్ట్ లో నుంచి భూమిలోకి పారలేదు, 1 ఒక ఎకరం కూడా తడవ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను గుర్తించి రైతుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆయకట్టు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed