Konda Surekha: ప్రపంచం ఆమెను గుండెల్లో పెట్టుకుంటుంది

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-03 10:28:35.0  )
Konda Surekha: ప్రపంచం ఆమెను గుండెల్లో పెట్టుకుంటుంది
X

దిశ,వెబ్‌డెస్క్: మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే(Savitribai Phule) అని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. శుక్రవారం సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళల పై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళలకు విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనితగా సావిత్రీబాయి ఫూలే ఖ్యాతిగడించారని మంత్రి అన్నారు. అనాథ పిల్లలు, స్త్రీలకు శరణాలయాలు, ఆశ్రమాలు నెలకొల్పడంతో పాటు సాంఘిక దురాచారాల నిర్మూలనకు, సమాజ ఉద్ధరణకు తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలిగా ఈ ప్రపంచం సావిత్రీబాయి ఫూలేని సదా గుండెల్లో పెట్టుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

మహిళలకు స్వేచ్ఛ లభిస్తే ఈ ప్రపంచానికి బానిసత్వం నుండి విముక్తి లభించినట్టేనని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆది నుండి వారికి సమాన అవకాశాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నదని మంత్రి సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలే నేడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణించేందుకు భూమికను ఏర్పరిచాయని స్పష్టం చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల స్వయం సాధికారత దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం పట్ల మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. స్త్రీవాదం పట్ల, మహిళల అభ్యున్నతి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు.




Advertisement

Next Story