దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం: ఏక్ నాథ్ షిండే

by GSrikanth |
దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం: ఏక్ నాథ్ షిండే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించడం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన విమోచన అమృతోత్సవాలకు ఆయన అతిథిగా హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై గైర్హాజరయ్యారు. ఆ రాష్ట్రంలో కూడా ఆయనకు వేడుకలున్న నేపథ్యంలో ప్రభుత్వం తరుపున మంత్రి శ్రీరాములును పంపించారు. ఈ సందర్భంగా ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో కూడా 'మరాఠ్వాడా ముక్తి దినోత్సవ్' పేరిట విమోచన వేడుకలను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టిందని, దీని ద్వారా దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి అమరుడికీ నివాళులర్పించినట్లయిందని వెల్లడించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది పోరాటాలు సాగించి అమరులయ్యారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలనుకోవడం శుభపరిణామంగా కొనియాడారు. ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ఆయన చెప్పుకొచ్చారు.

రజాకార్లు కర్కషంగా వ్యవహరించారు : కర్ణాటక మంత్రి శ్రీరాములు

ప్రజలపై రజాకార్లు అత్యంత కర్కషంగా వ్యవహరించారని కర్ణాటకకు చెందిన మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించే సాహసం ఎవరూ చేయలేదని, వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షించదగిన నిర్ణయంగా ఆయన కొనియాడారు. నిజాం సైనికులు మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలకు పాల్పడ్డారని, దారుణంగా హింసించారన్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రాంతాలపై రజాకార్ల దాడులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు వారికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ఆ సమయంలో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీ బలగాలతో నిజాం సైన్యంపై యుద్ధానికి దిగారన్నారు. 1948 సెప్టెంబర్ 13న యుద్ధాన్ని ప్రారంభిస్తే అదే నెలలో 17వ తేదీన నిజాం సైన్యం పటేల్ వీరత్వానికి తలవంచిందన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారని తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్ర్యం వస్తే తెలంగాణకు విముక్తి లభించడానికి ఏడాదికి పైగా పోరాడాల్సి వచ్చిందని వాపోయారు. కర్ణాటక, మహారాష్ట్రలో వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తెలంగాణలో కూడా కేంద్రం అధికారికంగా నిర్వహించడం గొప్ప నిర్ణయంగా చెప్పుకొచ్చారు.

అప్పుడు పటేల్.. ఇప్పుడు షా : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

1948 సెప్టెంబర్ 17వ తేదీన ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదే గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారని, అయితే తిరిగి 75 ఏండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన వేడుకలను నిర్వహించగా ఇప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమిత్ షాను అభినవ పటేల్ అంటూ ఆయన కొనియాడారు. 25 ఏండ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని పోరాటాలు చేశామని, ఇందుకోసం జైలుకు కూడా వెళ్లి ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చారు. నిజాం, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబాలకు ఆయన సెల్యూట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందంటే ఇది బీజేపీ, ప్రజల విజయంగా చెప్పారు. ఎవరు ఏ పేరుతో చేసినా వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు స్పష్టంచేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి ఆత్మలకు ఇప్పుడు శాంతి లభిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

ఇదిలా ఉండగా వేడుక ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములును కిషన్ రెడ్డి సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అందించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా తొలుత అమరుల స్తూపానికి నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెండా ఎగురవేసి బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బలగాల కవాతు చూపరులను కనువిందు చేసింది. తెలంగాణకు చెందిన బతుకమ్మ, బోనాలు, పోతరాజు, ఢోలు, డప్పు, ఒగ్గు కళాకారులు అలరించారు. గుస్సాడీ నృత్యాలు, విభిన్న కళలు చూపరులను ఆకట్టుకున్నాయి. 12 ట్రూపులుగా 1300 మంది కళాకారులు తమ ప్రదర్శనతో అలరించారు. మహారాష్ట్ర కళాకారుల బ్యాండ్ ట్రూప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకకు చెందిన రెండు ట్రూపులు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం పంచుకున్నాయి. కాగా విమోచన వేడుకల్లో స్వతంత్ర్య సమరయోధుల కుటుంబాలతో పాటు, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి కుటుంబ సభ్యులను అమిత్ షా సన్మానించారు.

Advertisement

Next Story

Most Viewed