కమలం గూటికి మాజీ మంత్రి? మునుగోడు ఉపఎన్నిక తర్వాత జంప్?

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-07 03:32:25.0  )
కమలం గూటికి మాజీ మంత్రి? మునుగోడు ఉపఎన్నిక తర్వాత జంప్?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ మంత్రి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సందిగ్ధంలో పడిపోయారు. సిట్టింగులకు మళ్లీ టికెట్లు కేటాయిస్తానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో జూపల్లి వర్గం నిరుత్సాహానికి గురైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డితో విభేదాలు ఉన్పప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందనే నమ్మకంతో జూపల్లి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కాని కేసీఆర్ ప్రకటనతో జూపల్లి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని నియోజకవర్గంలో చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఇద్దరు సీనియర్లు ఉండడంతో.. టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడం.. బీజేపీకి నియోజకవర్గంలో చెప్పుకోదగిన క్యాడర్ లేకపోవడంతో జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తర్వాత జూపల్లి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలు అయినప్పటికీ... తన క్యాడర్ దెబ్బతినకుండా కాపాడుకుంటూ వచ్చిన జూపల్లి కృష్ణారావుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుందన్న నమ్మకంతో అదే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తాం.. మరింత ఉత్సాహంగా పనిచేయండి అని చెప్పడంతో జూపల్లి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు అయ్యింది. దీనికి తోడు జూపల్లిపై గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన విషయం విధితమే. హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరే క్రమంలో వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో అధికార పార్టీ నుంచి తిరిగి హర్షవర్ధన్ రెడ్డికే అవకాశాలు ఉంటాయన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల ద్వారా స్పష్టం అయ్యింది. ఒకరకంగా జూపల్లి కృష్ణారావుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ నుండి అవకాశం వచ్చేది అంతంత మాత్రమే అని ప్రచారం జరుగుతోంది .

కాంగ్రెస్ లో అవకాశం రావడం కష్టమే

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసింది. ఈ కారణంగా ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత జగదీశ్వరరావు, యువ నేత అభిలాష రావు పార్టీని బలోపేతం చేసేందుకు వేరువేరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఇరువురిలో ఒకరికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ లభిస్తుందని ప్రచారం. ఈ క్రమంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరినా పార్టీ టికెట్ ఇవ్వడం కష్టసాధ్యమే అని ఆయన అభిమానులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగిన క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం కృషి జరుగుతున్నప్పటికీ.. ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగిన స్థాయిలో బలం లేదన్నది నగ్నసత్యం. సుధాకర్ రావు కు బదులుగా జూపల్లి కృష్ణారావును పార్టీలో అంత సులువుగా చేరకపోవచ్చునని నియోజకవర్గంలోని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

స్వతంత్రుడిగా నిలిచేందుకు ప్రాధాన్యం

అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేకుంటే... చివరిదాకా అదే పార్టీలో కొనసాగి టికెట్ కోసం ప్రయత్నించే యోచనలో జూపల్లి ఉన్నారని ఆయన అనుచర వర్గం చెబుతున్నారు. ఒకవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి లభించకపోయినా... కాంగ్రెస్ నుంచి అవకాశం దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న తలంపుతో జూపల్లి ఉన్నట్లు సమాచారం. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన జూపల్లి.. స్థానిక సంస్థల ఎన్నికలలోను తన మద్దతుదారులను స్వతంత్రులుగా పోటీ చేయించి గెలిపించుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రాధాన్యతను ఇవ్వవచ్చని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. స్వతంత్రుడిగా పోటీ చేయడం వల్ల అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని, ఇతర పార్టీల నుంచి చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు ఉండవన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది .

మునుగోడు తర్వాత పెను మార్పులు

మునుగోడు ఉపఎన్నికలో వచ్చే ఫలితాల ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాపై తీవ్రంగా చూపనుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విజయం సాధిస్తే జూపల్లి కృష్ణారావుతో సహా ఆయన నియోజకవర్గాలలోని పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు సైతం భారతీయ జనతా పార్టీ వైపుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read : బీజేపీలోకి మాజీ మంత్రి.. కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా 'బండి' ప్లాన్?

Advertisement

Next Story

Most Viewed