కోళ్ల షెడ్డుతో ఊరంతా దుర్వాసన..

by Sathputhe Rajesh |
కోళ్ల షెడ్డుతో ఊరంతా దుర్వాసన..
X

దిశ, ఉప్పునుంతల: గ్రామపంచాయతీకి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ అనుమతులతో స్థానిక నేతల అండదండలతో పొల్యూషన్ బోర్డుకు వ్యతిరేకంగా కోళ్ల షెడ్డు నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఫైర్ అయ్యారు. ఉప్పునుంతల మండలంలోని ఈరత్వానిపల్లి గ్రామంలో వెలసిన అక్రమ నిర్మాణ కోళ్ల షెడ్డుతో ప్రస్తుతం విలాసిత్ లోకల్ కంపెనీకి చెందిన కోడి పిల్లల పెంపకం కొనసాగుతున్న తరుణంలో గ్రామానికి తూర్పు దిక్కున నిర్మించిన షెడ్డు నుండి ప్రతి రోజు దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు.

మంగళవారం నిర్వహించిన గ్రామసభలో వారు పంచాయతీ కార్యదర్శి కళావతికి వినతి పత్రం అందజేశారు. ప్రతిరోజు దుర్వాసన వల్ల ఈగల వ్యాప్తి చెంది పిల్లలకు దోమల ద్వారా ఈగల ద్వారా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

గతంలో సర్పంచ్ ఒక్కడే పోరాటం

కోళ్ల ఫారం మొదలు నిర్మాణం చేపట్టినప్పుడే గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామానికి చెందిన సర్పంచ్ జక్కుల లింగమయ్య ఒంటరి పోరాటం చేశాడు. ఎన్నోసార్లు స్థానిక అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించి దాంతో పాటు మానవ హక్కుల చట్టాన్ని ఆశ్రయించి కోర్టు ద్వారా కూడా పోరాటం కొనసాగిస్తే గ్రామ ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా స్థానిక నేతల అండదండలతో నిర్మాణం కొనసాగించారన్నారు.

అప్పుడు సర్పంచ్ పోరాటానికి గ్రామ ప్రజల మద్దతు అంతంత మాత్రమే ఉండటంతో ఆయన కూడా ఒంటరి పోరాటాన్ని నిలిపివేశారని తెలిపారు. ప్రస్తుతం దాని వల్ల వస్తున్న నష్టం గుర్తించి న్యాయం చేయాలని లేనిచో శ్రీశైలం- హైదరాబాద్ నేషనల్ హైవే‌పై రాస్తారోకో నిర్వహిస్తామని గ్రామ ప్రజలు హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed