- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రాణాలు తీస్తున్న.. ఈత సరదా

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఈత సరదాలు.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిలిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వారం రోజుల్లో ఆరుగురు ఈతకు వెళ్లి ప్రాణాలను కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే మహబూబ్ నగర్ మండల పరిధిలోని డీవీటిపల్లి గ్రామ శివారులో ఉన్న క్వారీల కోసం తవ్విన గోతిలో ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఏకంగా ముగ్గురు ప్రాణాలను కోల్పోగా.. బాలనగర్ మండలం మూతి గణపురం గ్రామంలో పెద్ద చెరువు వద్ద ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు. ఈనెల 12వ తేదీన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామంలో ఓ వ్యక్తి తన పిల్లలకు పెద్దచెరువు వద్దకు తన పిల్లలను తీసుకెళ్లాడు. చెరువులోతు గమనించడానికి నీటిలోకి దిగిన ఆ వ్యక్తి అందులోనే కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి నెలలో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రానికి చెందిన రఫీ అనే యువకుడు సుంకేసుల డ్యామ్ వద్దకు ఈతకు వెళ్లి నదిలో ఉన్న గుంతలను గమనించకుండా లోపలికి వెళ్లి ఈత రాక మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఈత సరదా.. విషాదం కాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సలహాలు సూచనలు చేస్తున్నారు.
ఈత బాగా వచ్చినవారే నేర్పించాలి..
నేటి యువతలో చాలా మందికి ఈత కొట్టడం రాదు. నేర్చుకోవడానికి చెరువులు, బావులు అందుబాటులో ఉండకపోవడం.. తదితర కారణాలతో ఈత నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటాయి. కొంత మంది ఈత పై ఉన్న సరదాతో ఈ వేసవిలో చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లి ఈత నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత వచ్చిన వారు తమ పిల్లలకు ముందే తగిన జాగ్రత్తలు, సలహాలు సూచనలు చేసి ఈత నేర్చుకోవడానికి సిద్ధం చేయాలి. పైకి తెలిపేందుకు తేలికగా ఉండే కర్రలతో తయారు చేసిన బెండు కానీ, గాలి నింపిన డబ్బాలను కానీ ఊడిపోకుండా జాగ్రత్తగా కట్టుకోవాలి. లోతు ఎక్కువగా లేని ప్రదేశంలో పిల్లలకు ఈత నేర్పాలి. అవసరమైతే పిల్లల నడుముకు తాడును కట్టి నేర్పితే ఇంకా మంచిది. ఈత వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకు ఉప్పు వస్తోంది. లోతుకు వెళ్లాక ఈత నేర్చుకుంటున్న వారు.. నేర్పే వారిని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇద్దరి ప్రాణాలకు ముప్పు సంభవిస్తుంది. అందుకే లోతు తక్కువ, బురద, కంపలేని నీళ్లలో ఈతను నేర్పితే ప్రమాదాలు ఉండవు. పిల్లలను ఒంటరిగా ఈతకు పంపకుండా పెద్దలు తప్పనిసరిగా వెనక వెళ్లాలి.
మద్యం సేవించవద్దు..
కొంతమంది యువకులు మద్యం సేవించి ఈతకు వెళుతున్నట్లు సమాచారం. మద్యం సేవించడం విశాల్ లో ఉండి.. నేటి లోతు తెలియకపోవడం.. బురద, కంప చెట్లను గమనించకపోవడంతో అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించిన వారు ఈతకు వెళ్లకూడదని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈత ఆరోగ్యానికి మంచిది..
ఈత.. పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. ఈత కొట్టడం వల్ల వ్యాయామం చేసిన దానికన్నా ఎక్కువ మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, గుండె సంబంధం, తదితర అనేక రకాల వ్యాధులు ఈత వల్ల దూరం కావడంతో పాటు.. చురుగ్గా ఉండడానికి కూడా తోడ్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈతను నేర్చుకొని.. కొట్టడం చాలా మంచిది.. కానీ జాగ్రత్తలు పాటించకుంటే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వరుసగా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి.
జాగ్రత్తలు పాటించండి.. గాంధీ నాయక్, మహబూబ్ నగర్ రూరల్ సీఐ
వేసవిలో చాలా మంది ఈతకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇది ఒకింత మంచిదే.. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకే ముప్పు వస్తుంది. పిల్లలను ఒంటరిగా ఈతకు పంపకుండా పెద్దలు వెంట వెళ్లి ఇక నేర్పించాలి. నేర్పే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించిన వారు చెరువులు, బావులు, కుంటల వద్దకు వెళ్లి ఈత కొట్టే ప్రయత్నాలు చేయరాదు.