మున్సిపల్ కార్పొరేషన్ గా మహబూబ్ నగర్

by Naveena |
మున్సిపల్ కార్పొరేషన్ గా మహబూబ్ నగర్
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మున్సిపాల్టీ అప్ గ్రేడ్ అయి మున్సిపల్ కార్పోరేషన్ గా మారబోతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మేము పాలకులం కాదు సేవకులం అని స్పష్టం చేశారన్నారు. వారి మాటకు అనుగుణంగా తాము ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొన్న ప్రభుత్వ బీఇడి కళాశాలలో విద్యార్థులకు అత్యవసరమైన శౌచాలయాల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించామని అన్నారు. అలాగే నియోజకవర్గంలోని రామిరెడ్డి గూడెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల మైదానం శుభ్రం చేశామని ఆయన తెలిపారు. రాజకీయం అంటే సేవ చేయడం,ప్రజల్లో మమేకమై వారి సమస్యల్ని పరిష్కరించడమని నాడు మహాత్మా గాంధీ చెప్పారన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో భయపెట్టడం,భయబ్రాంతులకు గురిచేయడం,దౌర్జన్యం చేయడం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ కళాశాల,పాఠశాల,ఆఫీస్ లలో తాము శ్రమదానం చేసి,వీలైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. పురపాలక పరిధిలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ చైర్మన్,గ్రంథాలయ సంస్థ చైర్మన్,ముడా చైర్మన్ లు తిరిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారని,ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ మున్సిపాల్టీని మున్సిపల్ కార్పొరేషన్ చేయుటకు విధివిధానాలను తయారు చేస్తున్నారన్నారు. మహబూబ్ నగర్ కార్పోరేషన్ గా మారితే అదనపు నిధులు వస్తాయని,కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చేందుకు బీజేపి నాయకులను కూడా సంప్రదించి అధిక సంఖ్యలో నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,సిజె బెనహర్,ఫయాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story