గైరాన్ భూమి గాయబ్.. 15 మంది పేరిట ధరణిలో పట్టా

by Aamani |
గైరాన్ భూమి గాయబ్.. 15 మంది పేరిట ధరణిలో పట్టా
X

దిశ, అచ్చంపేట: ఎక్కడ ప్రభుత్వ భూమి.. కనిపిస్తే చాలు.. అక్కడ అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూముల రికార్డులను తారుమారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే అచ్చంపేటలో చోటు చేసుకుంది. గైరాన్ భూమిని పట్టా భూమిగా మార్చుకుని కొంతమంది సొమ్ము చేసుకునే యత్నాలు మొదలుపెట్టారు.

అచ్చంపేట పరిధిలోని సర్వే నెంబర్ 293..

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డు 293 సర్వే నెంబర్లు 4.32 ఎకరాల గైరాన్ పొలం ఉంది. 1955 నుంచి 2012-13 లో వరకు భూమి ప్రభుత్వ గైరాన్ భూమిగా రికార్డుల్లో ఉందని సమాచారం. దాదాపుగా రూ.15 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని 15మంది అక్రమార్కులు పట్టా భూమిగా రికార్డులు మార్చి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ గైరాన్ భూమిని .. పట్టా ఎవరు చేసుకున్నారు.. ఎంతమంది చేతులు మారాయి.. ఆ తతంగం వెనుక ఉన్న అధికారులు ఎవరు..!? అక్రమార్కులకు అండగా నిలుస్తున్నది ఎవరు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గుడిసెలు వేసుకుంటే తొలగించారు.చదును చేస్తుంటే మిన్న కున్నారు.

ఈ ప్రభుత్వ భూమిలో గతంలో కొంతమంది పేదలు గుడిసెలు వేసుకుంటే అప్పటి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించినట్లు సమాచారం. పట్టణంలో ఉన్న ఈ పొలంలో ప్రభుత్వ కార్యాలయాలు.. లేదా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని గతంలో ప్రయత్నాలు జరిగాయి. నిన్నటి వరకు ఆ స్థలాన్ని డంపింగ్ యార్డ్ కోసం ఉపయోగించారు. ఉన్న స్థలం అన్యాక్రాంతం అవుతుండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

అధికారులకు ఫిర్యాదు..

అన్యాక్రాంతం అవుతున్న విలువైన 4.32 ఎకరాల స్థలాన్ని కాపాడాలని 2013 జూన్ మూడున, ఈనెల 18న గిరిజన సంఘం నాయకులు మంగ్య నాయక్ తదితరులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సాగుతున్న కుట్రలను ఆధారాలతో సహా గిరిజన నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ భూమిని కాపాడకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మంగ్య నాయక్ మీడియాకు తెలిపారు.

4.32 ఎకరాలు ప్రభుత్వానిదే: ఆర్డీవో

సర్వే నెంబర్ 293 లో ఉన్న 4.32 ఎకరాల పొలం ముమ్మాటికి ప్రభుత్వానిదే అని ఆర్డీఓ మాధవి మీడియాకు తెలిపారు. 1955 నాటి రెవెన్యూ ఆర్ఓఆర్, పహాని ప్రకారం ఈ భూమి ప్రభుత్వ భూమిగా రికార్డులలో ఉంది అని ఆమె తెలిపారు. ఈ భూమిని అమ్ముకోవడం చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు. ఇప్పుడు పనులను ఆపి సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed