ఐటి టవర్ ప్రారంభంతో ఇంటింటికో ఉద్యోగం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Sumithra |
ఐటి టవర్ ప్రారంభంతో ఇంటింటికో ఉద్యోగం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ : జిల్లా కేంద్ర సమీపంలోని దివిటిపల్లిలో మే 6న ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఐటీటవర్ తో ఇంటింటికో ఉద్యోగం లభిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, ఇతర అధికారులతో కలసి నిర్మాణం పూర్తిచేసుకున్న ఐటిటవర్ ను సందర్శించారు. మే 6న ప్రారంభోత్సవ కార్యక్రమం నాడు అమెరికా, ఇంగ్లాండ్ కు చెందిన ఐటీ కంపెనీలు సైతం తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు.

ఇతర దేశాల్లో స్థిరపడిన పాలమూరు యువతకు ఇక్కడే మంచి వేత్తనాలు లభిస్తాయని, యువతకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 'ఐటి కం ఎనర్జీ పార్క్' ను చేపట్టామని తెలిపారు. వలసలు వెళ్ళే స్థాయి నుంచి ఉపాధి లభించే స్థాయికి మహబూబ్ నగర్ చేరుకుంటుందని మంత్రి తెలిపారు. ఐటీ కారిడార్ కు 400 ఏకరాల అసైన్డ్ భూములను సేకరించామని, అసైన్డ్ భూములైనా, పట్టా భూముల మాదిరిగా మెరుగైన పరిహారం అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరపుకుంటామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి తదితరులు ఉన్నారు.

సార్ నాకు ఆధార్ కార్డు ఇప్పించండి, బాగా చదువుకుంటా...

శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో దుర్గాప్రసాద్ అనే 11 ఏళ్ళ బాలుడు ఒంటరిగా వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలసి, సార్ నాకు ఆధార్ కార్డు ఇప్పించండి బాగా చదువుకుంటా..అని వేడుకున్నాడు. చదువుకోవాలనే బాలుడి తపనకు చలించి, వెంటనే తన సిబ్బంది ద్వారా పెయింటర్ వృత్తి చేసుకునే బాలుడి తండ్రి సతీష్ ను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని, బాలుడిని ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించి చదుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించి,'నీవు డాక్టర్ అయ్యే వరకు అండగా ఉంటానని' మంత్రి భరోసా ఇచ్చారు.

ఈద్గాను ప్రారంభించిన మంత్రి...

ఎదిర గ్రామం ఒకప్పుడు ఏరి పారేసినట్టుండే ప్రాంతమని, ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఇతరులు అబ్బుర పడేలా చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎదిర గ్రామ సమీపంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈద్గా ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ కమీటీ చైర్మెన్ అబ్ధుల్ రహమాన్, కౌన్సిలర్స్ ఉమర్, నసీరోద్ధీన్, షభ్భీర్, మాజీ సర్పంచ్ జంగయ్య తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed