ఓటరు జాబితాలో తప్పులను సరి చూసుకోండి: కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

by Kalyani |   ( Updated:2023-04-26 15:55:59.0  )
ఓటరు జాబితాలో  తప్పులను  సరి చూసుకోండి: కలెక్టర్ పి. ఉదయ్ కుమార్
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఓటరు జాబితాలో తప్పులను సరి చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఎలక్టోరల్ తుది జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున జిల్లాలో ఓటరు జాబితా పారదర్శకంగా తప్పొప్పులను సరి చూసుకోవాలన్నారు.

మరణించిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉండటం వంటివి లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు వస్తుంటాయని అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వెంటనే తమ రాజకీయ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక సహాయ బీఎల్ఓను నియమించి అట్టి జాబితాను తహసీల్దార్లకు అందజేయాలని కోరారు. తహసీల్దార్లు అన్ని పోలింగ్ బూత్ లకు బీఎల్ఓలను నియమించి బీఎల్ఓ లకు సహాయ బీఎల్ఓ లకు కలిపి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

తమ బూత్ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి వ్యక్తికి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించడం, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, ఏ బూత్ ఓటరు అదే ఏరియాలో ఉండేవిధంగా చూసుకోవడం, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తొలగించాలన్నారు. అయితే ఏ వ్యక్తి పేరునైనా సరే ఓటరు జాబితా నుంచి తొలగించేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, డిప్యూటీ తహసీల్దార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ధారణ చేసుకున్నాకే తొలగించాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ సైతం ఉండాలని సూచించారు. మండల స్థాయిలో ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు.

ఎన్నికలకు సంబంధించి ఏ పని చేసిన నిబంధనలకు లోబడి చేయాలని అందుకు ఎన్నికల నియమావళి పుస్తకాలు చదవాలని సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా లేదా నిర్లక్ష్యం వహించిన ఉపేక్షించబోమని హెచ్చరించారు. కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారందరికి ఎపిక్ కార్డు వచ్చే విధంగా చూడాలని తెలియజేశారు. ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే డిప్యూటీ తహసీల్దార్ స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు.

ఎక్కడైతే ఓటరు నమోదు శాతం తక్కువగా ఉందో అక్కడ ఓటరు నమోదు కొరకు స్వీప్ యాక్టివిటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మోతిలాల్ తహసీల్దార్లకు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్లు తొలగించడం, సవరణలు ఎలా చేయాలి, నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఆర్డీఒలు, తహ సీల్దార్లు, ఎన్నికల డీటీలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed