- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో గందరగోళం
దిశ, ప్రతినిధి వనపర్తి : జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో గజం స్థలం కొనాలంటే వేలాది రూపాయల ధర పలుకుతుండడంతో.. నిరుపేదలు సొంత ఇల్లు నిర్మించుకోవడం గగనంగా మారింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశపెట్టడంతో నిరుపేదలు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే ఒక్కో ఇల్లు విడివిడిగా నిర్మించడానికి ఖాళీ జాగాలు లేకపోవడంతో అధికారులు పట్టణంలో కొన్ని చోట్ల స్థలాలను ఎంపిక చేసి అపార్‌మెంట్ తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టారు. ఎలాగైతేనేమి తమకు సొంత ఇంటి కల నెరవేరబోతుందని పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం పలుమార్లు అన్ని హంగు ఆర్బాటాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి కేటాయిస్తామని ఊరించడంతో అందరూ ఆనందించారు. కానీ చివరకు లబ్ధిదారుల ఎంపికలో అనర్హుల పేర్లు ఎక్కువగా చేరడంతో నిరుపేదలు ఉసూరుమంటూ నిట్టూర్పులిడుస్తున్నారు.
జిల్లా కేంద్రంలో 1320 ఇండ్లు..
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని చింతల హనుమాన్ దేవాలయం దగ్గర, అప్పాయిపల్లి సమీపంలో, పీర్లగుట్టపై, రాజపేట సమీపంలో, పెద్దగూడెం క్రాస్ రోడ్‌లో మొత్తం ఐదు చోట్ల స్థలాలను ఎంపిక చేసి అపార్ట్‌మెంట్ తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టారు. అయితే అప్పాయిపల్లి సమీపంలో, చింతల హనుమాన్ దేవాలయం సమీపంలో నిర్మించిన ఇండ్లు దాదాపు పూర్తయ్యాయి. అలాగే పీర్ల గుట్ట, పెద్దగూడెం దగ్గర సైతం నిర్మాణాలు తుది దశలోకి చేరుకోవడంతో అర్హులకు ఇండ్ల పంపిణీ చేపట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అయితే పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు, చింతల హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రభుత్వం పట్టాలు పొంది ఉన్న బాధితులకు ఇదివరకే దాదాపు 400 మందికి డబుల్ ఇండ్లు కేటాయించేశారు. ఇప్పుడు రెండో విడతలో భాగంగా 543 ఇండ్లను పంపిణీ చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల అర్హులు, అనర్హుల పేరిట అధికారులు జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాలను సైతం స్వీకరించారు. అయితే అధికారులు ప్రకటించిన జాబితాలో ఇదివరకే సొంత ఇల్లు ఉన్న వారికి, ఆర్థికంగా బలంగా ఉన్న వారి పేర్లు చేర్చారని, అర్హుల పేర్లు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రీ సర్వే చేయాలని కలెక్టర్‌కు వినతి..
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాల కేటాయింపునకు పట్టణంలోని పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు తమ వార్డులో తెలిసిన వారికి ఇల్లు కేటాయిస్తామని హామీలు ఇచ్చారు. కచ్చితంగా తాము చెప్పిన పేర్లు డబుల్ బెడ్ రూమ్ అర్హుల జాబితాలో ఉంటాయని అనుకున్న నేతలు.. జాబితా చూసిన తర్వాత ఖంగుతిన్నారు. తాము సిఫార్సు చేసిన పేర్లు జాబితాలో గల్లంతు కావడం, ఆయా వార్డుల్లో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమయ్యాయని నిలదీయడంతో అధికార పార్టీ నేతలు కలెక్టర్ వద్దకు పరుగులు తీశారు. రీ సర్వే చేసి అనర్హుల పేర్లను తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించాలని విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ రీ సర్వే చేసి అర్హుల జాబితా సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.