మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపొందించాలి.. కలెక్టర్ విజయేందిర

by Sumithra |
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపొందించాలి.. కలెక్టర్ విజయేందిర
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకొని, మహబూబ్ నగర్ ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి.విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్ లో జిల్లా వైద్య ఆరోగ్య, ఎక్సైజ్ శాఖ, మహిళా, శిశు సంక్షేమం, విద్యా శాఖల అధికారులతో ఆమె సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం పై పోలీస్, ఎక్సైజ్ శాఖలు గట్టి నిఘా ఉంచాలని, కళాశాలలు, విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి అలవాటు పడితే కేరియర్, భవిష్యత్తు నాశనం అవుతుందని, ఎక్కడైనా వాటిని అమ్ముతున్నా, సరఫరా జరుగుతున్నా పోలీసులకు తెలిపేలా వారికి సూచించాలని అన్నారు. డ్రగ్స్ నియంత్రణకు గాను ఆయా శాఖల అధికారులు ఒక టీమ్ లాగా ఏర్పడి పని చేయాలని ఆమె ఆదేశించారు.

కళాశాల, పాఠశాలల్లో మాదకద్రవ్యాల నియంత్రణ పై కమిటీలు ఏర్పాటు చేసి అవగాహనకు కార్యాచరణ రూపొందించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. 18 సంవత్సరాలలోపు వారు ఉంటే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. గంజాయి సాగు చేస్తే వ్యవసాయ, అటవీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, మత్తు కోసం వినియోగించే ఆల్ఫోజోలం లాంటి మందులను డాక్టర్ ల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలని, డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ ద్వారా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రమణా రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా, ఇంటెలిజెన్స్ ఏఎస్పీ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story