Collector BM Santosh : రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు..

by Sumithra |
Collector BM Santosh : రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు..
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ, సహకార శాఖ, లీడ్ బ్యాంక్ మేనేజర్ లతో కలిసి రైతు రుణమాఫీ (పథకం) కార్యక్రమం పై తీసుకోవలసిన చర్యల పై గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ... ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే రైతు రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆయన తెలిపారు. జిల్లాలో 24 వేల 398 మంది రైతులు, 23 వేల 548 రైతు కుటుంబాలకు రూ.144 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని, ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు తేదీ 12 డిసెంబర్, 2018 లేదా ఆ తరువాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-డిసెంబర్, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

మొదటి విడతగా ఒక లక్ష వరకు..

రెండో విడతలో మరో లక్ష వరకు దశల వారీగా రుణమాఫీ కార్యక్రమం అమలు చేస్తారన్నారు. ఈ పథకంలో ప్రయోజనం పొందే లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. జిల్లాలోని బ్యాంకులు, సహకార శాఖ ద్వారా రైతులకు నేరుగా వారి వారి ఖాతాలలో రుణమాఫీ సొమ్ము జమవుతుందని అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో వ్యవసాయ శాఖ బ్యాంకులతో కలిపి కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కమిటీల ద్వారా వివిధ కారణాల వల్ల తలెత్తే సమస్యలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ కోసం వచ్చే రైతులకు పూర్తిగా సహకరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సహకరించాలన్నారు. సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాలలో రైతు వేదికల వద్ద రుణమాఫీ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలోని 24,398 లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు జమ చేస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, డీసీఓ ప్రసాద్ రావు, ఎల్డీఎం అయ్యపు రెడ్డి, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed