KTR : ప్రేమ దుకాణం అన్నారు..విద్వేషాల రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : ప్రేమ దుకాణం అన్నారు..విద్వేషాల రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ (Congress) పాలకులు ఎన్నికల్లో ప్రేమ (మెహబ్బత్) దుకాణం అంటూ మాట్లాడారని, కానీ అన్నీ విద్వేషాల రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ ను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ విధించాల్సి పరిస్థితి లేకుండా పరిపాలన చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ దసరా, దీపావళి సందర్భంగా ఒక నెల మొత్తం ఇప్పుడు కర్ఫ్యూ విధించారని విమర్శించారు. అందుకే కేసీఆర్ ఎక్కడ ఈ చిచోరా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అని కేటీఆర్ విమర్శించారు. 2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగుతాయని అనుమానాలు వ్యాప్తి చేశారన్నారు. కానీ కేసీఆర్ పదేళ్ల హయంలో గంగా-జమున తహజీబ్ ను పాటించటంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారన్నారు. కేసీఆర్ మనిషిని, మనిషిగా మానవత్వంతో చూశారని, కానీ మత పరంగా, ఓట్ల పరంగా చూడలేదని చెప్పుకొచ్చారు. అన్ని మతాల వారికి మేలు చేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్ మస్ కానుకలు ఇచ్చారని తెలిపారు. అందరినీ కలుపుకొని పోయే పాలన కేసీఆర్ చేసి చూపించారని, మన పిల్లలకు ఎంత మంచి విద్యను అందిస్తే రాష్ట్రం భవిష్యత్ అంత బాగుంటుందని కేసీఆర్ నమ్మారన్నారు. 200 లకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను కేసీఆర్ ఏర్పాటు చేశారని, దాదాపు లక్షా 40 వేల మంది విద్యార్థులపై ఏటా రూ. లక్షా 20 వేల ఖర్చు చేశారని వివరించారు. మైనార్టీ గురుకుల స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్మాత్మక విద్యాసంస్థల్లో చదువుతూ రాష్ట్రం గర్వపడేలా చేస్తున్నారని, అది ఎంతో సంతోషానిస్తోందన్నారు.

మౌలానా అబుల్ కలాం పేరుతో 2, 751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షలు రూపాయలు ఇవ్వటం జరిగిందని, దాదాపు రూ. 438 కోట్లు ఖర్చు చేశారన్నారు. నాంపల్లి లో 100 కోట్ల రూపాయల విలువ గల 2 ఎకరాలు భూమి కేటాయించి రూ. 40 కోట్లతో అనిసిల్ గుర్బా ను నిర్మించారని తెలిపారు. మక్కా మసీదు మరమత్తుల కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇస్లామిక్ సెంటర్ కోసం రూ. 40 కోట్లతో సెంటర్ ను కోకాపేటలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారని, రూ. 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం కోసం దేశంలోనే ఎవరు ఖర్చు చేయని విధంగా కేసీఆర్ చేశారని, దేశంలో ఎక్కడ లేని విధంగా షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షా ఇచ్చారని, ఇమామ్, మౌలానాలకు రూ. 5 వేలు నెలకు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మైనార్టీని డిప్యూటీ సీఎంగా చేశారని, హైదరాబాద్ లో డిప్యూటీ మేయర్ పదవిని కూడా ముస్లింలకు ఇచ్చిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు వదిలి వేశారని, ఇప్పుడు ఒక్క మూసీ పేరుతో 16 వేల పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

గరీబులు, పేదల కోసం చిత్తశుద్ధితో మంచి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ వాళ్లు చాలా హామీలు ఇచ్చారని, మైనార్టీ సబ్ ప్లాన్ రూ. 4 వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తా అన్నారని, ఆరు నెలల్లో మైనార్టీ జన గణన అన్నారని, జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు కల్పిస్తామన్నారన్నారని ఏమీ చేస్తారో చూద్దామన్నారు. వెయ్యి కోట్లతో మైనార్టీల ఉపాధికి లోన్లు ఇస్తామన్నారని, కానీ రూ. లక్ష కూడా ఇవ్వలేదన్నారు. మౌలానా ఆజాద్ పేరుతో తోఫా ఏ తలీమ్ అన్నారని, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలన్నారు. పీహెచ్ డీ పీజీ చేసిన వాళ్లకు రూ. 5 లక్షలు అన్నారని, కానీ ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదన్నారు. ఇమామ్ లు, మౌలనాలకు రూ. 12 వేలు ఇస్తామంటూ వాగ్దానం చేశారని, ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలు, అదే విధంగా ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారని, షాదీ ముబారక్ పేరుతో రూ. లక్షా 5 వేలు, అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నారని ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం వద్దు అని వాళ్లను పడగొట్టేందుకు ఇంకే మార్గం లేదా అని వరంగల్ పర్యటనలో ప్రజలు అడిగారని, కానీ ఒక్కసారి ఓటు వేస్తే ఐదేళ్లు వాళ్లను భరించాల్సిందేనని, దాదాపు 60 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్లు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూడొచ్చన్నారు. అందరీ సంక్షేమం కోసం పనిచేసిన కేసీఆర్ కు తప్పకుండా మీరు మళ్లీ అవకాశం ఇస్తారని నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed