రేషన్ కార్డు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ : డిప్యూటీ CM భట్టి

by Rajesh |   ( Updated:2024-07-17 11:05:42.0  )
రేషన్ కార్డు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ : డిప్యూటీ CM భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రజాభవన్ లో సీఎం అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నాయకులతో జరిగిన మీటింగ్ లో మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు. ఎవరిని వదిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయబోతున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, ప్రతీ రూపాయిని పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టనున్నామని స్పష్టం చేశారు. అన్ని కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయబోతున్నామని వెల్లడించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు, రుణమాఫీ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రతీ పోలింగ్ బూతు, ఓటర్ దగ్గరకు ఈ కార్యక్రమాన్ని చేరవేయాలన్నారు. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీని చేసేందుకు 25 వేలు చొప్పున నాలుగు దఫాలుగా పూర్తి చేశారని గుర్తు చేశారు. కానీ ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేయబోతున్నామన్నారు. ఆర్ధిక ఇబ్బందులున్నా, అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేశామన్నారు.

అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారన్నారు. సీఎం సవాల్ ఓట్ల కోసమే, ఎన్నికల కోసమే అంటూ కొందరు విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రుణమాఫీని చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే రుణమాపీ కార్యక్రమాన్ని ప్రతీ ఇంటికి చేర్చాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదనే అంశాన్ని రైతులకు వివరించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed